శాంతి చర్చల నుంచి ఇరాన్ వాకౌట్.. ట్రంప్ ట్వీట్ కారణం!
Publish Date:Jun 22, 2026
Advertisement
అమెరికా, ఇరాన్ శాంతి చర్చలలో మళ్లీ ప్రతిష్ఠంభన నెలకొంది. స్విట్జర్ ల్యాండ్ లోని లూసర్న్ సరస్సు సమీపంలో ఉన్న బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఆదివారం (జూన్ 21) జరిగిన శాంతి చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. ఈ చర్చల మధ్యలో ఇరాన్ వాకౌట్ చేసింది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా శాంతి ఒప్పందంపై సంతకాలు లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల సెషన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒకే ఒక్క పోస్ట్ భగ్నం చేసింది. చర్చల ప్రక్రియ సాగుతుండగానే ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి అత్యంత కఠినమైన సైనిక హెచ్చరికలు జారీ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకు నిరసనగా ఇరాన్ చర్చల నుంచి వాకౌట్ చేసింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా వంటి తమ మిత్రపక్ష సాయుధ గ్రూపులను ఇరాన్ వెంటనే నియంత్రించకపోతే, ఆ దేశంపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన బాంబు దాడులు, సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చర్చల హాల్‌లోకి చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ చేసిన తీవ్రమైన బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ నేతృత్వంలోని తమ బృందం ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఒకవైపు అత్యున్నత స్థాయి శాంతి చర్చలు జరుపుతూ.. మరోవైపు ఇలాంటి బెదిరింపులకు దిగడం అంతర్జాతీయ దౌత్య నీతికి పూర్తి విరుద్ధని పేర్కొంటూ.. ఇరాన్ ప్రతినిధులు చర్చల హాల్ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. ఖతార్, పాకిస్థాన్ దేశాల దౌత్యవేత్తలు ముమ్మరంగా రాయబారాలు నడిపి ఎట్టకేలకు ఇరాన్ ప్రతినిధులు, తిరిగి చర్చల టేబుల్ ముందుకు వచ్చేలా చేశాయి. దీంతో ఆదివారం (జూన్ 21)రాత్రి తిరిగి చర్చలు ప్రారంభమై సోమవారం (జూన్ 22) తెల్లవారుజాము వరకు కొనసాగాయి. అమెరికా తరఫున ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడి ప్రత్యేక దూతలు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌లతో కూడిన అత్యున్నత స్థాయి బృందం ఈ చర్చల్లో పాల్గొంది.
http://www.teluguone.com/news/content/ran-walks-out-of-peace-talks-36-223715.html





