రమ్య కుటుంబాన్ని వెంటాడుతున్న మైనర్లు..
Publish Date:Sep 14, 2016
Advertisement
రోడ్డు ప్రమాదం..అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ప్రయాణంలో ఒక్కసారిగా హాహాకారాలు..రక్షించమంటూ ఆర్తనాదాలు. భార్యకు భర్తను, భర్తకు భార్యను, తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని, పిల్లల నుంచి తల్లిదండ్రుల్ని దూరం చేస్తుంది. పోయినోళ్లు బాగానే ఉన్నా..బతికున్నవాళ్లు అనుభవించే మానసిక క్షోభ మాటలకు అందనిది. అలాంటి స్థితిలో వారికి మరో ప్రమాదం ఎదురైతే..మృత్యువు నీడలా వెంటాడితే. ఇప్పుడు అచ్చం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది తాగుబోతుల నిర్లక్ష్యానికి బలైపోయిన చిన్నారి రమ్య కుటుంబం. సరిగ్గా రెండు నెలల క్రితం పట్టపగలు పీకలదాకా తాగి బీటెక్ విద్యార్థులు కారు నడిపి పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద చేసిన యాక్సిడెంట్ గుర్తుందా..? ఆ తాగుబోతులు చేసిన పాపానికి నాలుగు కుటుంబాలలో తీరని విషాదం నింపింది. చిన్నారి రమ్య సహా ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోగా..రమ్య తల్లిదండ్రులు మంచానికే పరిమితమయ్యారు. ఆ ప్రమాదంలో చనిపోయిన రమ్య బాబాయి రాజేశ్ భార్య శిల్ప ఈసారి ప్రమాదానికి గురయ్యారు. శిల్ప, ఆమె అక్క, బావ మరో చిన్నారి కారులో ఏఎస్‌రావు నగర్, రుక్మిణిపురి కాలనీ నుంచి కాప్రా మీదుగా వయా ఘట్కేసర్ నుంచి నల్లగొండలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే కాప్రా సాకేత్ టవర్స్ వద్ద వేగంగా వస్తున్న బైకు వీరి కారును ఢీకొట్టింది. కారు కుడివైపు ముందు భాగంగా స్వల్పంగా దెబ్బతింది. బైక్ నడుపుతున్నయువకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీనిపై శిల్ప కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్ చేసిన యువకుడి పేరు సోహైల్ అతను మైనరు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నాడు పంజాగుట్ట వద్ద రయ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ చేసింది మైనర్లే. ఆ ప్రమాదంతో రంగంలోకి దిగిన నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి లైసెన్స్‌లు లేని మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత మరచిపోవడం ఆనవాయితీగా మారింది తప్ప శాశ్వత చర్యలు శూన్యం. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకుంటే మంచిది. ఒకవేళ జరగరానిది జరిగితే విలువైన ప్రాణాలు పోవడంతో పాటు మీ పిల్లల భవిష్యత్ నాశనమైపోతుంది. కాగా జరిగిన ప్రమాదంపై శిల్ప స్పందిస్తూ భర్త, రమ్య, మావయ్యను కోల్పోయి షాక్‌లో ఉన్నానని. చాలా రోజుల తర్వాత తన కుమారుడిని తీసుకుని బయటకు వెళ్లానని శిల్ప కన్నీటి పర్యంతమయ్యారు. బావగారు చాలా నెమ్మదిగానే కారును డ్రైవ్ చేస్తున్నారని.. ఆటోను ఓవర్‌టేక్ చేస్తూ వస్తున్న ద్విచక్రవాహనాన్ని గమనించి కారును సైడ్‌కు తీసుకున్నారని లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని..వారి చేతిలోనే తమ కుటుంబమంతా హతమవ్వాలా.?? అని ప్రశ్నించారు. తమకు మైనర్ల రూపంలోనే ప్రమాదం వెంటాడుతూనే ఉందని వాపోయారు. మైనర్లు వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
http://www.teluguone.com/news/content/ramya-accident-45-66462.html





