చిల్లర తెచ్చిన సమ్మె...!
Publish Date:Sep 13, 2016
Advertisement
ఆర్టీసీ బస్సు ఎక్కగానే టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్‌కు సహకరించండి అని ఉండే కొటేషన్‌ని మనలో ప్రతి ఒక్కరం చదివే ఉంటాం. ఆ వాక్యం ఎదో కాలక్షేపానికి రాసిందో..బస్సు లోపం అందంగా ఉండటానికో రాసింది కాదు. ఆ చిన్న వాక్యాన్ని పాటించి ఉన్నట్లయితే ప్రభుత్వానికి కోటి రూపాయల నష్టం వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్ ఉప్పల్ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ను తెలంగాణ ఆర్టీసీ అధికారులు మరో డిపోకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ నిన్న హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఎనిమిది డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని వేరే చోటికి వెళ్లేందుకు ఒక ప్రయాణికురాలు ఉప్పల్ డిపోకు చెందిన బస్సు ఎక్కి టికెట్ తీసుకుంది..రూపాయి చిల్లర రావాల్సి ఉండటంతో దిగేటప్పుడు ఇస్తానని కండక్టర్ చెప్పింది. దిగాల్సిన స్టాప్ రావడంతో తనకు రావాల్సిన రూపాయి చిల్లర ఇవ్వమని అడిగిన ప్రయాణికురాలితో మహిళా కండక్టర్ దురుసుగా మాట్లాడింది. ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికురాలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్టీసీ ఎండీ శాఖాపరమైన విచారణ జరిపి మహిళా కండక్టర్‌ను మరో డిపోకు బదిలీ చేశారు. అధికారుల చర్యను నిరసిస్తూ ఆదివారం ఆమెకు మద్దతుగా టీఎంయూ నాయకులు ఉప్పల్ డిపో ముందు ఆందోళన చేపట్టి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తొలుత ఆందోళన ఉప్పల్ డిపోకు మాత్రమే పరిమితమైంది..అయితే విషయం ఆ నోటా ఈ నోటా మిగతా డిపోలకు పాకింది. హయత్‌నగర్ 1,2, బండ్లగూడ, మహేశ్వరం, మిధాని, ఇబ్రహీంపట్నం, దిల్‌సుఖ్‌నగర్ డిపోలకు చెందిన కార్మికులు కూడా బస్సులను నిలిపివేశారు. అధికారులు, కార్మికులు పంతానికి పోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్క బస్సు కూడా కదల్లేదు. యూనియన్ నాయకులు సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరింత జఠిలం చేశారు. సమ్మె కారణంగా సంస్థకు సుమారు కోటి రూపాయల నష్టం కలిగింది. ప్రయాణికురాలు సరిపడా చిల్లర తీసుకెళ్లినా..కండక్టర్ రూపాయి చిల్లర ఇచ్చేసి ఉన్నా ఇంత నష్టం కలిగి ఉండేది కాదు. అటు యూనియన్ నేతలు కూడా ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. చిన్న విషయానికే టీఎంయూ నేతలు బస్సులను నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించకోకుండా మెరుపు సమ్మెకు దిగడంతో సంస్థకు తీరని నష్టం కలిగింది.
http://www.teluguone.com/news/content/-telangana-state-road-transport-corporation-45-66430.html





