మగధీరుడి పెళ్ళి ఖర్చులు రూ.20కోట్లు పైనే?
Publish Date:Jun 16, 2012
Advertisement
హైదరాబాద్: పెళ్ళి అంటే ఒక జంట జీవితం ఆరంభించడం దానికి సంఘం ఆమోదముద్ర వేయటం. దానిని బంధువులు మిత్రులతో కలిపి సెలబ్రేట్ చేసుకోవటం. అయితే దాని పరిధిని పెంచి దర్పాన్ని డాబుని ప్రదర్శించడానికి ఇదో సందర్భంగా వినియోగించుకోవటం ఈ మధ్య చూస్తున్నాము. ఎనభైయవ దశకంలో అందర్నీ ఆకర్షించిన అప్పటి కేంద్ర రైల్వే శాఖమంత్రి మాధవరావు సింధియా కుమార్తె వివాహాన్ని గురించి చర్చించాలి. గ్యాలియర్ సంస్థానాధీశుని పుత్రికగా వైభవంగా జరిపించిన తీరు పలువురిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా రైల్వే మంత్రిగా వున్న మాధవరావు సింధియా వెండి రైలుని చేయించి దాని బోగీల్లో విందుభోజనాలను డైనింగ్ టేబిల్ మీద రైలు పట్టాలు మీద తిరిగే విధంగా వుంచటం ఆహుతులకు ఆనందాశ్చర్యాలను ఇచ్చింది. ఆ తరువాత జరిగిన పెళ్ళిళ్ళలో చెప్పుకోదగ్గది జయలలిత పెంపుడు కొడుకు పెళ్ళి. ఇన్విటేషన్లతోపాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ లకు మిగతా మంత్రులకు పంపిన పట్టు చీరలు, బంగారు గిఫ్టులగురించి చెప్పుకున్నారు.
ఈ దశకంలో జరిగిన మరోపెళ్ళి స్టీల్ టైకూన్ నవీన్ మిట్టల్ ఇంట జరిగిన వివాహం ఇది పరదేశంలో జరిగినా బాలివుడ్ తారలంతా అక్కడ ప్రత్యక్షమయ్యి ఆహుతులను అలరించారు. పెళ్ళికి హాజరైన అతిధులకు వారి హోదాను బట్టి అందచేసిన బహుమతులు వారికి హుందాతనాన్ని ప్రతిబింభించినా విమర్శలకు తావిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబునాయుని కుమారునికి బాలకృష్ణ కుమార్తెకు జరిగిన పెళ్ళిగురించి అందరూ ముచ్చటించుకున్నారు. ఈ వివాహానికి రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈమధ్యనే జరిగిన కధానాయకుడు అల్లుఅర్జున్ వివాహకార్యక్రమం సినీ ఉద్దండులందరినీ వివాహకార్యక్రమానికి హాజరయ్యేలా చేసింది. దీనిని అభిమానులు తిలకించడానికి గాను టివిలో ప్రత్యక్ష ప్రసారాన్ని చేశారు. ఆ తర్వాత జరిగిన జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళి చెప్పుకోతగ్గది. ఈ పెళ్ళి కూడా వ్యాపారవేత్తలతోను, రాజకీయ నాయకులతోను కళకళలాడింది. ఇదికూడా ప్రత్యక్ష ప్రసారంతో అభిమానులను అలరించింది.
నిన్నటి మగమహారాజు కుమారుడు మగధీర వివాహమహోత్సవం భారీ సెట్టింగులతో దేశ విదేశ ప్రత్యేక ప్రతినిధులతో, ఉద్దండ రాజకీయ నాయకులతో వెలిగిపోయింది. చిరంజీవి రాష్ట్ర రాజకీయాలలో తనదైన ప్రత్యేకత చాటుతున్న నేపధ్యంలోనూ అంతకుముందే ఆయనకున్న మెగాస్టార్ ఇమేజ్ నూ దృష్టిలో పెట్టుకొని భారీసెట్టింగులతో ఆర్భాటంగా వివాహవేడుకలు నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు సుమారు 20 కోట్లు ఖర్చుచేసి ఉంటారని అంచనా. ఈ బడాబాబులు వేడుకల ఖర్చు లెక్కపెట్టి ఐటి లెక్కలు కట్టి టాక్సును కట్టించే అధికారులెక్కడా కనిపించడం లేదు. కష్టపడి ఉద్యోగాలు చేసే వారి వద్ద నుంచి గోళ్ళు ఊడగొట్టి మరీ పన్నులు వసూలు చేసే ఇన్ కం టాక్స్ అధికారులకు ఈ సెలబ్రిటీలు వివాహాలకు చేస్తున్న కోట్లాది రూపాయల ఖర్చులు టీ.వీ.ల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/ramcharan-teja-24-14920.html





