చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.6 కోట్లు వసూలు చేసి పరార్..!
Publish Date:Aug 2, 2026
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక చిట్టీల పేరుతో మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బుద్వేల్‌లో చిట్టీల పేరుతో సుమారు రూ.6 కోట్లు వసూలు చేసిన ఆశోక్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఇంటిని ఖాళీ చేసి పరారైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ గ్రీన్‌సిటీ కాలనీ ప్రాంతానికి చెందిన ఆశోక్ అనే వ్యక్తి అదే ప్రాంతంలోని ఐఎంఆర్ మిల్లెట్ స్టేషన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత సుమారు 20 ఏళ్లుగా బుద్వేల్ గ్రీన్‌సిటీ కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా చిన్న మొత్తాలతో చిట్టీల నిర్వహణ ప్రారంభించాడు. మొదట్లో ఆశోక్‌పై స్థానికులకు పెద్దగా అనుమానాలు లేకపోయాయి. చిట్టీలు పూర్తయిన తర్వాత సభ్యులకు వారి డబ్బులు తిరిగి చెల్లిస్తూ క్రమంగా నమ్మకం సంపాదించు కున్నాడు. ఇలా కొన్నేళ్ల పాటు చిట్టీలు నిర్వహిం చడంతో కాలనీలో చాలామంది అతని పూర్తిగా నమ్మి అతని వద్ద చిట్టీలు వేశారు.అయితే చిట్టీలు పూర్తయిన తర్వాత చేతికి వచ్చిన డబ్బును తన వద్దే ఉంచితే నెలకు 2 శాతం వడ్డీ ఇస్తానంటూ ఆశోక్ పలువురిని నమ్మించాడు. దీంతో చిట్టీ డబ్బులతో పాటు పలువురు తమ వద్ద ఉన్న సొమ్మును కూడా అతనికి ఇచ్చారు. కొంతకాలం పాటు తీసుకున్న డబ్బుకు వడ్డీలు చెల్లిస్తూ నమ్మకం కలిగించాడు.. దీంతో మరింత మంది పెద్ద మొత్తాలను అతని వద్ద పెట్టారు. ఇలా చిట్టీల సొమ్ముతో పాటు వడ్డీకి తీసుకున్న డబ్బులు కలిపి సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేశాడు. ఈ నెలలో పలువురి చిట్టీలు ముగియను న్నాయి. దీంతో చిట్టీ డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో బాధితులు ఆశోక్ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆశోక్ కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసి పరారైనట్లు తెలుసుకున్న బాధితులు లబోదిబో మంటూ కన్నీరు మున్నీరయ్యారు. తమ జీవితకాల సంపాదనను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపో యామని గ్రహించిన బాధితులు పెద్ద సంఖ్యలో ఆశోక్ ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇంటి ముందు బైఠాయించి ధర్నా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. "పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కట్టాం.. డబ్బులు తిరిగి వస్తాయనుకున్న సమయంలో అశోక్ పరారయ్యాడు" అంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబ అవసరాల కోసం కష్టపడి సంపాదించిన డబ్బును చిట్టీల్లో పెట్టామని, ఇప్పుడు ఆ సొమ్మంతా పోయిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఆశోక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఈ ఘటనపై బాధితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిట్టీల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి పరారైన ఆశోక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అనధికారిక చిట్టీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులు తిరిగి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరుతున్నారు.ఆశోక్ పరారైన నేపథ్యంలో అతని ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు, ఆరోపణల ఆధారంగా అసలు ఎంత మొత్తం వసూలు చేశాడు? ఎక్కడికి వెళ్లాడు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారణ జరగాల్సి ఉంది. Rajendranagar, Budvel Green City, Ashok, Fraud, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police
http://www.teluguone.com/news/content/rajendranagar-36-227812.html





