వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 15 మందిపై కేసు నమోదు..!
Publish Date:Aug 2, 2026
Advertisement
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శాసనసభ్యుడు విరూపాక్షితో పాటు ఆయన అనుచరులపై స్థానిక పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిప్పగిరి పోలీసులు ఈ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. బాధితుడు శేఖర్ ఇచ్చిన ఆధారాలతో ఎమ్మెల్యేతో పాటు దాదాపు 15 మందిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్, సంగాల గ్రామానికి చెందిన వైసీపీ సభ్యుడు గిరి మధ్య ఫోన్లో వ్యక్తిగత వివాదం తలెత్తింది. ఈ చిన్నపాటి వివాదం క్రమంగా తీవ్రస్థాయి ఘర్షణకు దారితీసింది. ఈ విషయాన్ని గిరి వెంటనే ఎమ్మెల్యే విరూపాక్షి దృష్టికి తీసుకువెళ్లడంతో, ఆయన తన ప్రధాన అనుచరులతో కలిసి నేమకల్లు గ్రామానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు ముఖాముఖి తలపడటంతో పాటు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఈ రాళ్లదాడి ఘటనలో టీడీపీ కార్యకర్త శేఖర్ తలకు తీవ్రగాయాలు కాగా, మరొక వ్యక్తి నాగరాజుకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎడమచేతికి సైతం దెబ్బలు తగిలాయి. సమాచారం అందుకున్న ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ నాయకుల వాహనాలపై సైతం దాడులు జరగడంతో పరిస్ధితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కార్యకర్తలకు రక్షణగా ఉంటామని, వైసీపీ నాయకుల అరాచకాలను అడ్డుకుంటామని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి స్పష్టం చేశారు. ప్రస్తుతం నేమకల్లు, సంగాల తదితర పరిసర గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. Aluru YSRCP MLA Virupakshi, Kurnool District Political Clashes, Chippagiri Police Station SC ST Case, Nemakallu Stone Pelting Incident
http://www.teluguone.com/news/content/aluru-ysrcp-mla-virupakshi-36-227805.html





