రాజస్థాన్ హైకోర్ట్ సై అంది! తమిళనాడు హైకోర్ట్ నై అంది!
Publish Date:May 31, 2017
Advertisement
ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. ఆవుని చంపితే జీవిత ఖైదు విధించగలిగేలా చట్టం చేయండి. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? ఏ కాషాయ నేతో మీడియా ముందు చేసిన హాట్ కామెంట్స్ కాదు! రాజస్థాన్ హై కోర్టు వేసిన ఆర్డర్! కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, 51A(g) ల ప్రకారం గో రక్షణ చేయాలని న్యాయస్థానం సూచించింది! అసలు ఆవుని రక్షించాల్సిన బాధ్యత కోర్టు పై ఎందుకు పడింది అంటారా? రాజస్థాన్ లోని ఓ ప్రపంచ ప్రఖ్యాత గోశాల నిర్వహణపై ప్రస్తుతం కేసు నడుస్తోంది. అందులో పోయిన సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్య కాలంలో 8వేల ఆవులు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడ్డాయి. ఆ అంశాన్ని విచారిస్తున్న న్యాయమూర్తులు గో సంరక్షణ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేశారు. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి పశు సంపద కాపాడుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా వుందని పేర్కొంటూ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్ని రాజస్థాన్ కోర్టు సూచించింది! ఒకవైపు రాజస్థాన్ కోర్టు ఆవుని కాపాడాలని కేంద్రానికి చెబుతుంటే మరో వైపు తమిళనాడు హైకోర్టు మంగళవారం నాడు పశు విక్రయాలపై మోదీ సర్కార్ చేసిన నిర్ణయంపై స్టే విధించింది. పశువుల్ని వ్యవసాయ అవసరాల కోసం తప్ప కబేళాలకు అమ్మటానికి వీలు లేదని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రతి పక్ష పార్టీలు తీవ్ర నిరసనలకు దిగుతుండటం తెలిసిందే కదా! వారితో పాటూ ఇప్పుడు హై కోర్టులు కూడా రెండు వైపులా మోహరించినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ హై కోర్టు ఆర్డర్ బీజేపికి అనుకూలంగా వుంటే , మద్రాస్ హై కోర్ట్ స్టే విధింపు అపోజిషన్ కు ఆనందంగా వుంది! కేరళలో కమ్యూనిస్టులు ఆవు మాంసం పబ్లిగ్గా తింటూ నిరనసన తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు ఒకరు మరో అడుగు ముందుకేసి కెమెరాల ముందు గోవధకి పాల్పడి అమానుషంగా ప్రవర్తించారు. మమతా బెనర్జీ కూడా గోమాంసంపై తీవ్రంగా గోల చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో కోర్టులు కూడా అదికార, ప్రతిపక్షాలకి ఆయుధాల్లా ఉపయోగపడే నిర్ణయాలు చేస్తుండటం… గొడవ మరింత ముదిరేలా చేస్తుందనిపిస్తోంది! చూడాలి మరి ముందు ముందు దేశ రాజకీయాలు, గోమాత పరిస్థితి ఎలా తయారవుతాయో!
http://www.teluguone.com/news/content/rajashtan-high-court-45-75241.html





