ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం.. లోకేష్ ఫైర్
Publish Date:Aug 31, 2022
Advertisement
రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గుండ్రాలు విసిరే సంస్కృతి ప్రస్తుతం ఏపీలో ఉంది. ఒక ఫ్యాక్షనిస్టు, పిరికి వాడు ప్రభుత్వాధినేతగా ఉంటే ఆ రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉంటుందో చెప్పడానికి ఏపీ నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. విమర్శ అంటే భయం, ప్రజలంటే భయం..దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పోలీసుల అండతో అక్రమ కేసులు, అరెస్టులు, వైసీపీ గూండాలతో దాడులు.. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పంలో అన్న క్యాంటిన్ ను రెండో సారి కూల్చేసిన తరువాత ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు పర్యటనలో ఆయన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజాస్వామ్యంపై ఇసుమంతైనా గౌవరం లేని ఒక ఫ్యాక్షనిస్టు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారని దుయ్యబట్టారు. ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే రాష్ట్రం ఎంత అధోగతి పాలౌతుందో అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని లోకేష్ అన్నారు. అయిన దానికీ కాని దానికీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 60 మందికి పైగా తెలుగుదేశం కీలక నేతలపై కేసులు పెట్టారనీ, ఐదు వేల మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారనీ లోకేష్ అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి తెలుగుదేశం డీఎన్ఎలో భయం అన్న పదానికి తావేలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఐపీసీ(ఇండియన్ పీలన్ కోడ్)ని ఫాలో కావడం లేదనీ, జేపీసీ(జగన్ పీనల్ కోడ్)ని ఫాలో అవుతున్నారనీ లోకేష్ అన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసులకు తెలుగుదేశం నేతల ముందు మీసం మెలేసి, తొడ కొట్టడం, తెలుగుదేశం నాయకులపై దాడులు చేయడం ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారెవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సొంత చెల్లి, తల్లికివ అన్నంపెట్టకుండా బయటకు గెంటేసిన దుర్మార్గుడు జగన్ పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్ లను కూడా కూల్చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హయాంలో నడుస్తున్న అన్న క్యాంటిన్లను రద్దు చేశారు, ఇప్పుడు తెలుగుదేశం నిర్వహిస్తున్న క్యాంటిన్లను కూల్చివేస్తున్నారు అని విమర్శించారు. మంగళగిరి లో తాను అన్న క్యాంటీన్ పెడితే ధ్వంసం చేసారు. కుప్పం లో అన్న క్యాంటీన్ పై దాడి చేసారని లోకేష్ విమర్శించారు. ప్రశాంతంగా ఉండే కుప్పం పులివెందుల పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉన్న చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే కనీస భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలకు బాధ్యులు వైసీపీ గూండాలైతే.. అమ్ముడుపోయిన పోలీసులు టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని, అరెస్టులు చేశారని విమర్శించారు. వైసిపి గూండాల దాడి ని అడ్డుకుంటే హత్యాయత్నం కేసులా? అన్నారు. పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వాడు…ఇక్కడికి వచ్చి కుప్పంను అభివృద్ది చేస్తాడా? అని లోకేష్ ఎద్దేవా చేశారు. గడప గడప కి వెళ్లలేని వైసిపి నాయకులు కుప్పంలో గొప్పలు చెప్పడం హస్యాస్పదంగా ఉందని లోకేష్ అన్నారు.
http://www.teluguone.com/news/content/rajareddy-constitution-in-ap-criticise-lokesh-25-143009.html