ఒకే ఒక్కడు కేజ్రీవాల్! బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆప్ వికర్ష్ ఆపరేషన్
Publish Date:Aug 31, 2022
Advertisement
దేశంలో మోడీ,షా ద్వయం ఎత్తులను చిత్తు చేస్తూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఒకే ఒక్క బీజేపీయేతర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేల్చేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేజ్రీవాల్ తానే స్వయంగా ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేసిన తరువాత కూడా ఆప్ ధీమాగా ఉంది. అక్రమ కేసు అంటు నిలబడింది. సోదాలు, తనిఖీలను పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. ఆప్ ఎమ్మెల్యేలు 40 మందికి ఒక్కొక్కరికీ పాతిక కోట్ల రూపాయలు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించి.. కమలనాథుల ప్రలోభాలకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగలేదని సగర్వంగా ప్రకటించి.. ప్రభుత్వం పట్ల ఆప్ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించడానికే నంటూ తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకుని మోడీకి సవాల్ విసిరారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్ తన ప్రసంగంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని కాలరాసి.. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రాలలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. వాస్తవానికి అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైందనీ, కానీ కేజ్రీవాలే స్వియంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టి బీజేపీకి కేజ్రీవాల్ షాక్ ఇచ్చారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఏ సీఎం కూడా స్వయంగా తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరు. కానీ కేజ్రీవాల్ రూటే సెపరేటు. తన ప్రభుత్వంపై, తన ఎమ్మెల్యేలపై అచంచల విశ్వాసం, తనకున్న ప్రజాదరణపై నమ్మకం ఉన్నందునే కేజ్రీవాల్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సాధారణంగా విశ్వాస తీర్మానంపై సభ్యులందరూ మాట్లాడిన తరువాత ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు. ఈ విషయంలో కూడా కేజ్రీవాల్ బీజేపీకి, కేంద్రానికి ఝలక్ ఇచ్చారు. ముందుగా తానే ప్రసంగించడం ద్వారా బీజేపీకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి కల్పించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రంలోని మోడీ సర్కార్ కూలదోసిన తీరును కళ్లకు కట్టినట్లు వివంరించారు. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం తరువాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబైలో స్పందించిన తీరే కేజ్రీవాల్ ప్రసంగం ఎంత సూటిగా, సుత్తిలేకుండా ఉందో అవగతమౌతుంది. కేజ్రీవాల్ మాదిరిగా తాను కమల నాథుల కుట్రలను ముందుగా పసిగట్ట లేకపోయానని అంగీకరించారు. దేశమంతటా కాషాయి జెండా ఎగరాలన్న ఆకాంక్షతో కమలనాథులు సాగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిం చిన పార్టీ ఫిరాయింపుల విధానం కన్నా దుర్మార్గమైనదని కేజ్రీవాల్ విమర్శించారు.
http://www.teluguone.com/news/content/kejriwal-vikarsh-operation-against-bjp-operation-akarsh-25-143011.html