జగన్మాయా.. కనికట్టా.. రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది కేంద్రమా?..!
Publish Date:Jun 3, 2022
Advertisement
దొంగకు తేలు కుడితే ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్ ఉన్న పరిస్థితిని చూస్తే తెలిసిపోతుంది. ఎదుటి వాడి సొమ్ముతో పండగ చేసుకుంటే.. అప్పటికి సంబరంగానే ఉన్నా నిజం బైటపడిన తరువాత సీన్ సితార అయిపోతుంది. పరువు గంగలో కలుస్తుంది. జగన్ సర్కార్ పరిస్థితి ఇప్పుడలాగే తయారైంది. ముఖ్యమంత్రి జగన్ తన బ్రైన్ చైల్డ్ గా రైతు భరోసా కేంద్రాల గురించి గొప్పగా చెప్పుకున్నారు. అవసరం ఉన్నా లేకున్నా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చేసి గప్పాలు కొట్టుకున్నారు. రైతులకు అవసరమయ్యే సర్వ సేవలూ ఇక్కడ లభ్యమౌతాయని తన భుజాలను తానే చరిచేసుకుని సంబరపడిపోయారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో మొత్తం దేశం ఏపీవైపు చూసేలా జగన్ చేశారని లెక్కలేనన్ని సార్లు ప్రతికలలో ప్రకటనలు ఇచ్చేసి బాకా ఊదుకున్నారు. తీరా చూస్తే ఆ కేంద్రాల నిర్మాణానికి కేంద్రమే నిధులిచ్చిందని తేలిపోయింది. కేంద్రం సొమ్ముతో సొంత బాకా ఊదుకుంటున్న జగన్ కు రైతు భరోసా కేంద్రాల పేరు మార్చేయమంటూ కేంద్రం హుకుం జారీ చేయడంతో దిమ్మ తిరిగింది. అసలు వాస్తవం బైటపడిపోయింది. రైతు భరోసా కేంద్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది కూలీ పాత్ర. సొమ్ములు ఇచ్చి కట్టించింది కేంద్రం అని తేలిపోయింది. ఇప్పటి వరకూ అంతా తమ ఘనతే అంటూ సొంత భజన చేసుకున్న జగన్ సర్కార్ కేంద్రం రైతు భరోసా కేంద్రాల పేరు మార్చాలని నిర్ణయించడంతో అవాస్తవాలతో జనాన్ని మభ్యపెడితే ఏం జరుగుతుందన్న తత్వం బోధపడి బొమ్మ కనిపించింది. రైతు భరోసా కేంద్రాల పేరును రైతు ఉత్పత్తి నిల్వ కేంద్రాలుగా మార్చమని కేంద్రం జగన్ సర్కార్ కు హుకుం జారీ చేసింది. ఆలా మార్చకుంటే తానే రంగంలోకి దిగి మార్చేస్తానని హెచ్చరించింది. దీంతో జగన్ బండారం బైటపడిపోయింది. దీంతో అనివార్యంగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ రైతు భరోసా కేంద్రాల ఘనత కేంద్రానిదేనని, తమ ప్రభుత్వం కేవలం కూలీలా వాటిని కట్టిందని ఒప్పుకుని లెంపలేసుకోవలసి వచ్చింది. రైతు భరోసా కేంద్రాల పేర నిర్మించిన భవనాలకు 90 శాతం నిధులు కేంద్రం సమకూర్చింది. వీటిని గ్రామీణ ఉపాధి పథకంతో లింక్ చేశారు. వైసీపీ సర్కార్ కేవలం వాటిని కట్టించిందంతే. కానీ ఒక్కో భవనానికి 21 లక్షల రూపాయలు వెచ్చించి తమ ప్రభుత్వమే వాటిని నిర్మించిందని జగన్ బిల్డప్ ఇచ్చారు. తన ఫొటోలతో ఫుల్ పేజీ అడ్వర్టైజ్ మెంట్లు కూడా ఇచ్చుకున్నారు. నిజానికి జరిగిందేమిటంటే కేంద్రం సొమ్ముతో జగన్ సోకు చేశారు. వాస్తవం బయటపడటంతో దొంగకు తేలుకుట్టినట్లుగా ముఖ్యమంత్రి మౌన ముద్ర వహించారు. రైతు భరోసా కేంద్రాలేనా.. గ్రామ సచివాలయాల నిర్మాణాలలోనూ కేంద్రం నిధులే వాడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది కేంద్రమేనని ఇప్పుడు వాటి పేరు మార్పు నిర్ణయంతో బయట పడింది. దీంతో గ్రామ సచివాలయాల బండారమూ బయటపడింది. మరి ఇంతకీ జగన్ ఈ మూడేళ్ల కాలంలో అప్పులు కాక మరేం చేసినట్లు అని జనం చర్చించుకుంటున్న పరిస్థితి.
http://www.teluguone.com/news/content/raithu-bharosa-kendras-with-center-funds-25-136999.html





