రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రైళ్లలో ఈ పనులు చేయకూడదట..!
Publish Date:Aug 8, 2026
Advertisement
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది. అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్ఫోన్లు లేకుండా స్పీకర్లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా అవసరం అనిపిస్తే వారు తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్ , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు. కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని, వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/railway-rules-35-228356.html




