వదల జగన్ నిన్నొదల.. సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్
Publish Date:Oct 23, 2021
Advertisement
వదల జగన్ నిన్నొదల. ఆరు నూరైనా నిన్నొదల. సీఎం జగన్ను తిరిగి జైలుకు పంపే వరకూ వదల బొమ్మాళిలా వెంటబడతానంటున్నారు ఎంపీ రఘురామ. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు.. ఈ పిటిషన్ కాకపోతే మరో పిటిషన్.. ఏది ఏమైనా జగన్ బెయిల్ రద్దు చేయించడమే రఘురామ టార్గెట్లా కనిపిస్తోంది. తాజాగా, జగన్ కేసులో రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించడం వైసీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులను వేగంగా విచారించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు తగ్గట్టు లా పాయింట్ బయటకు తీశారు. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిందని పిటిషన్లో తెలిపారు. సుప్రీంకోర్టు పాత తీర్పునే ఆధారంగా చూపిస్తూ.. అదే సుప్రీంకోర్టులో రఘురామ కేసు వేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని.. వారి బెయిల్ రద్దు చేయాలని ఆ పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టులో ఉండగా.. రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించడం వ్యూహాత్మక అడుగు అంటున్నారు. అయితే, ఆ వివరాలు చెబుతూ.. మా జగన్ నిర్దోషిగా బయటకు రావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశానంటూ రఘురామ సెటైర్ వేయడం మరింత హైలైట్.
http://www.teluguone.com/news/content/raghurama-files-petition-in-supreme-court-against-jagan-bail-39-125077.html





