పుట్ట మధు అరెస్ట్.. ఈటల టార్గెట్‌గానే..నా?
Publish Date:May 8, 2021
Advertisement
అనుకున్న్టటుగానే అయింది. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధును భీమవరంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. అరెస్ట్‌తో వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పుట్ట మధు ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. పుట్ట మధు వారం రోజులుగా కనిపించకపోవడంతో ఆయన అదృశ్యానికి సంబంధించి కారణాలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని అంటున్నారు. అయితే, పైకి వామనరావు కేసును చూపిస్తున్నా.. లోలోన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్‌గా పుట్ట మధును టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు చాలా సన్నిహితుడు. మాజీ మంత్రి ఈటల రాజేందర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు. ఇద్దరు వేరు వేరు జిల్లాల నేతలు. కానీ తాజా ఈటల ఎపిసోడ్‌లో పుట్ట మధు పేరు సైతం తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి ఈటలపై భూకబ్జా కేసు ఫైల్ కాగానే.. పుట్ట మధు ఎస్కేప్. అప్పటి నుంచీ ఇప్పుడు అరెస్ట్ అయ్యే వరకూ ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్. ఇంతకీ, ఈటల వ్యవహారంతో పుట్ట మధుకు ఏం సంబంధం? ఈటల రాజేందర్‌పై కేసు నమోదైనప్పటి నుంచీ పుట్ట మధు ఎందుకు పరారీలో ఉన్నారు? వాళ్లిద్దరి మధ్య మిలాఖత్ ఏంటి? తెరవెనుక జరుగుతున్న రాజకీయ కుట్ర ఏంటి? ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. పుట్ట మధు. కొన్ని నెలల క్రితం నడిరోడ్డు మీద జరిగిన లాయర్ వామనరావు దంపతుల హత్యలో.. పుట్ట మధు పేరు ప్రముఖంగా వినిపించింది. పుట్ట మధు నేర చరిత్రపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసులో పట్ట మధు మేనల్లుడు కీలక సూత్రదారిగా తేల్చారు పోలీసులు. ఆ తర్వాత అంతా సైలెంట్. ఇటీవల సడెన్‌గా ఈటలపై భూకబ్జా కేసు నమోదవడం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం జరిగిపోయాయి. మాజీ మంత్రిపై మరింత ఉచ్చు బిగించేందుకు ఆయన గతాన్ని తవ్వి పోస్తున్నారు పోలీసులు. ఈ విషయం తెలిసి పుట్ట మధు ఉలిక్కిపడ్డాడని అంటున్నారు. ఎందుకంటే, ఈటలతో పలు వ్యవహారాల్లో, దందాల్లో ఆయనకూ ప్రధాన భాగస్వామ్యం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఈటలను ఆ కేసుల్లో ఇరికించాలంటే.. పుట్ట మధును కార్నర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈ విషయం పసిగట్టిన మధు.. రాత్రికి రాత్రే పత్తా లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది. మధు ఎక్కడు ఉన్నాడనేది ఇన్ని రోజులూ మిస్టరీగా మారింది. మంథని నుంచి నేరుగా మహారాష్ట్రకు వెళ్లినట్టు సమాచారం. ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారమూ జరిగింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌ల సహాయంతో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వివరణ ఇచ్చుకునేందుకు.. తన కుటుంబ సభ్యుల ద్వారా పుట్ట మధు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఈటలతో ఇన్నేళ్లూ స్నేహం చేసిన మాట వాస్తవమే అయినా.. ప్రస్తుతం ఇక ఆయనతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోనంటూ సీఎం ముందు సరెండర్ అయ్యేందుకు మధు ట్రై చేశాడని అన్నారు. అయితే, పుట్ట మధు.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం తెగ ప్రయత్నించినా దొరకలేదట. కేసీఆర్‌ను కలిసి కాంప్రమైజ్ కావాలని తన గాడ్‌ఫాదర్స్‌తో అన్ని విధాలుగా లాబీయింగ్ చేశాడట. ఈ లోగా భీమవరంలో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పుట్ట మధును అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. వామనరావు దంపతుల మర్డర్ కేసునా? లేక, ఈటల భూదందాల విషయమై ఆరా తీసేందుకా? అనేది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి ఈటల డొంక కదిలించడానికి.. పుట్ట మధు తీగను లాగుతుండటం.. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
http://www.teluguone.com/news/content/putta-madhu-arrested-in-bhimavaram-39-115059.html





