కన్నుల పండువగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. పోటెత్తిన భక్త జనసంద్రం.!
Publish Date:Jul 16, 2026
Advertisement
ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీలో జగన్నాథ రథయాత్ర గురువారం (జులై 16) వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు. జగన్నాథుడు, తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవితో కలిసి గర్భగుడిని వీడి భక్తులకు దర్శనమిచ్చేందుకు వచ్చే ఘట్టమే ఈ రథయాత్ర. ఏడాదికి ఒకే ఒక్కసారి జరిగే ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు, స్వామివారి రథాల తాడును తాకి పునీతులు అవ్వడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పూరీ క్షేత్రానికి లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో పూరీ వీధులన్నీ భక్తజన సంద్రంగా మారిపోయాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి కొలువై ఉన్న ఆ భారీ రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఏడాది పొడవునా ఆలయంలో పూజలందుకునే దేవతామూర్తులు, రథాలపై ఊరేగుతూ గుండిచా ఆలయంలోని తమ అత్తవారింటికి వెళతారు. పూరీ రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రథయాత్ర భారతదేశానికి చెందిన మహోన్నత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి సజీవ ప్రతీక ప్రధాని మోడీ అభివర్ణించారు. జగన్నాథుడి కృపాకటాక్షాలతో దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. లక్షలాది మంది భక్తులు ఒకే చోటకు చేరే ఇంతటి భారీ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒడిశా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తుల రక్షణ కోసం 13 వేల మంది పోలీసు సిబ్బందిని, కేంద్ర బలగాలను మోహరించారు. , ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దించింది. అలాగే.. క్షేత్రస్థాయిలో భద్రతను డిజిటల్ రూపంలో పర్యవేక్షించేందుకు పూరీ నగరవ్యాప్తంగా 473 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. రథయాత్రను సుదూరం నుంచి వచ్చే భక్తులు స్పష్టంగా వీక్షించేందుకు వీలుగా నగరంలోని ముఖ్య కూడళ్లలో 65 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. Odisha Puri Temple, Lord Jagannath Rathotsavam, Gundicha Temple Festival, Narendra Modi Rath Yatra Wishes
http://www.teluguone.com/news/content/puri-jagannath-rath-yatra-begins-36-226118.html





