తెలంగాణా ఊపిరి పీల్చుకో ప్రియాంక వస్తున్నారు!
Publish Date:Jun 8, 2023
Advertisement
మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు. బాహుబలి సినిమాలో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు దాదాపుగా ఇలాంటి డైలాగ్ నే నినాదంగా మార్చుకున్నారు. తెలంగాణా ఊపిరి పీల్చుకో.. సోనియమ్మ బిడ్డ వస్తోంది. ప్రియాంక గాంధీ వస్తోంది అంటున్నారు. హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ బాగా బలోపేతం అయ్యింది. ఆ రెండు రాష్ట్రాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారం ఖాయమన్న ధీమా కాంగ్రెస్ లో వ్యక్తమౌతోంది. రాజస్థాన్ లోనూ పార్టీ బలంగా ఉన్నా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్న, మాజీ ఉపముఖ్యమంత్రి రాజేష్ పైలట్ మధ్య విభేదాలు ఆ పార్టీని ఒకింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. అదలా ఉంచితే.. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం ఇంకా బకాయిపడే ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న భావన అధిష్ఠానంలో ఉంది. అందుకే ఈ సారి తెలంగాణపై కాంగ్రెైస్ హై కమాండ్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందు కోసం ఆమె ఉత్తర ప్రదేశ్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇక నేడో రేపో ఆయన తెలంగాణ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత కొంత కాలం నుంచీ ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తన నాయనమ్మ ఇందిరాగాంధీ లాగే రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారన్న వార్తలు కూడా పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీలన్నీ ఇటీవల కాలంలో ఆమె వద్దకే వెడుతున్నాయి. ముఖ్యంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి పార్టీని వీడకుండా కట్టడి చేయడంలోనూ.. తన అసమ్మతిని, అసంతృప్తిని పక్కన పెట్టి టీపీసీసీ చీఫ్ తో కలిసి పని చేసేలా ఒప్పించడంలోనూ ప్రియాంక గాంధీ పాత్ర కీలకంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల కిందటే రాష్టరానికి వచ్చిన ప్రియాంక గాంధీ స్వల్ప వ్యవధిలోనే అంటే ఈ 9, 10 తేదీలలో ప్రియాంకా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర నేతలకు సమాచారం అందిందనీ చెబుతున్నారు. అంతే కాకుండా ఈ నేలాఖరులో లేదా జులై మొదటి వారంలో ప్రియాంక తెలంగాణలో విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నాయనీ చెబుతున్నారు. అన్నిటికీ మించి ఒకటి రెండు రోజులలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో భేటీ కానున్న ప్రియాంక ఈ భేటీలో పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు పరిష్కరించి.. వచ్చే ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తెలంగాణలో ప్రియాంక చురుకుగా వ్యవహరిస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలలో వేరే లెవెల్ లో ఉంటుందని పార్టీ నాయకత్వం గట్టిగా చెబుతోంది. త్వరలో తెలంగాణ బాధ్యతలను ఆమె అధికారికంగా చేపట్టనున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇప్పటికే ఆమె అనధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారనీ, పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే తమ సమస్యలను నేరుగా ప్రియాంక దృష్టికే తీసుకువెడుతున్నారని చెబుతున్నారు. ఇక అమె పూర్తి సమయం తెలంగాణపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద బండి నడకే అవుతుందన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/priyanka-to-be-telangana-congress-incharge-39-156517.html