విభజన...‘విడిది’
Publish Date:Dec 30, 2013
Advertisement
గతంలో శీతాకాల విడిదికి గాను హైదరాబాద్‌కు వచ్చిన ఏ రాష్ట్రపతికీ ఈ తరహా అనుభవం ఎదురై ఉండదు. దీనికి కారణం రాష్ట్రంలో నెలకొన్న విభజన పరిస్థితులే. గందరగోళంగా రాష్ట్ర పరిస్థితి రాష్ట్రపతి నిలయాన్ని కేంద్రంగా మార్చుకోవాలని చూస్తుండడంతో... విశ్రాంతి నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ... ఫుల్ బిజీగా మారిపోయారు. పార్టీల వారీగా వచ్చేవారు కొందరు, వ్యక్తిగతంగా వచ్చేవారు మరికొందరు... గుట్టల కొద్దీ వినతిపత్రాలు, అర్జీల మీద అర్జీలు వచ్చి పడుతుంటే పాపం...ఏం చేయాలో తెలియక ఓపికగా అందర్నీ ఆహ్వానిస్తున్నారు. దీంతో నగరంలోని రాష్ట్రపతినిలయం ఎప్పుడూ లేనంత సందడిగా మారింది. మామూలుగా అయితే ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలవడం అంటే అంత తేలికైన విషయం కాదు. పైగా అసలు ఆయన అపాయింట్‌మెంట్ దొరకడమే గగనం. ఎంతో వ్యయప్రయసలకు ఓర్చుకుని అక్కడి దాకా వెళ్లినా అక్కడ ఉండే బిజీ కారణంగా రాష్ట్రపతి ఇచ్చే సమయం ఏదో కొన్ని నిమిషాలకు మించి ఉండదు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న పార్టీలు, వ్యక్తులు... విడిదిలో బస పూర్తయిపోయేలోగా... తమ పని చక్కబెట్టేసుకోవాలని ఆరాటపడుతున్నారు. నిజానికి విభజనకు సంబంధించినంత వరకూ ఇరు ప్రాంతాల నేతలు చేస్తున్న వాదనలు, వినిపిస్తున్న అంశాలు కొత్తవీ కావు... ఇప్పటిదాకా ప్రణబ్‌కు తెలియనివీ కావు. మరెందుకీ ఆరాటం అంటారా? అదేనండీ మైలేజీ.
నిజానికి తామే సమైక్యవాద ఛాంపియన్‌లం అని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నవారు అందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోదలచుకోవడం లేదు. వారే ఈ మార్గం కనిపెట్టారు. అది మరెందరికో దారి చూపింది. ముక్కలు చెక్కలుగా విడిపోయిన సమైక్యవాదులు... ఒకరొకరుగా రాష్ట్రపతిని కలిసి వచ్చి, ఆ విషయాన్ని మీడియాకు వెళ్లడిస్తూ బోలెడంత మైలేజీ తెచ్చేసుకుంటుంటే... కంగారుపడిపోయిన ప్రత్యేకవాదులు కూడా అదే బాట పట్టారు. అందుకోసం అప్పటికప్పుడు ఉమ్మడిరాజధానిని రెండేళ్లు కుదించాలనే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చి మరీ రాష్ట్రపతిని కలిసొచ్చారు. గతంలో పదేళ్ల ఉమ్మడికి ఒప్పుకున్న నాయకులు ఇప్పటికిప్పుడు రెండేళ్ల డిమాండ్ తేవడం విచిత్రమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ‘వాదుల’ హోరు చూస్తున్న మరికొందరు వ్యక్తులు పలు రకాల సంస్థలు, సంఘాలు అప్పటికప్పుడు తమ డిమాండ్లను గుర్తు తెచ్చుకుని ఛలో రాష్ట్రపతి నిలయం అంటున్నారు. ఏదేమైనా... నేతల ప్రచార కండూతి కాస్త తగ్గితే ఆ మేరకు ఈ శీతాకాలవిడిది రాష్ట్రపతికి విశ్రాంతిని ఇస్తుంది.
http://www.teluguone.com/news/content/president-mukherjee-on-two-day-hyderabad-visit-39-28885.html