ఓటమి తప్పని యుద్ధానికి సిద్ధమవుతోన్న సోనియా!
Publish Date:May 26, 2017
Advertisement
ఇప్పుడు దేశంలో అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న అంశం… నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరు? అద్వానీ నుంచీ రజినీకాంత్ దాకా చాలా మంది పేర్లే వినిపించాయి. అయితే, అటు అద్వానీ కాని… ఇటు రజినీకాంత్ కాని రాష్ట్రపతి అవ్వకపోవచ్చని ఆల్రెడీ సంకేతాలు వచ్చేస్తున్నాయి. అద్వానీ మీద కోర్టు విచారణ రాష్ట్రపతి ఎన్నికల కంటే వేగంగా దూసుకొస్తోంది. ఇటు రజినీకాంత్ తన స్వంత పార్టీ పెట్టి తమిళనాడు సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది! మరి తరువాతి రాష్ట్రపతి ఎవరు? ప్రణబ్ తరువాత రాష్ట్రపతి భవన్ ఎవరిదో తెలియదుగాని… ప్రణబ్ మాత్రం ఇక సెలవు అంటున్నారు దిల్లీకి! మరో రెండు నెలల్లో తన పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి తనతో పని చేస్తోన్న అధికారుల్ని వారి వారి మంత్రిత్వ శాఖలకి తిప్పి పంపేస్తున్నాని ఆయన చెప్పారు. అంటే అర్థం ప్రణబ్ దా ఇక నేరుగా కోల్ కతా ఫ్లైట్ ఎక్కేస్తారనే! ఆయన ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూల్లో శేష జీవితం స్వరాష్ట్రంలో గడుపుతానని అన్నారు! ప్రణబ్ తనకు రెండోసారి రాష్ట్రపతి రేసులో వుండే ఉద్దేశం లేదని చెప్పటానికి కారణం పదవి మీద ఇష్టం లేక కాదు. ప్రస్తుతం మెజార్టీ వున్నా బీజేపికాని, ఎన్డీఏ కూటమి కాని ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చే ఉద్దేశంలో లేవు. అటువంటప్పుడు ప్రతిపక్షాల్ని నమ్ముకుని పోటీలో వుండటం కోరి ఓడిపోవటమే తప్ప మరోటి కాదు. అందుకే, గౌరవంగా పక్కకు తప్పుకుంటున్నాడు మన సీనియర్ కాంగ్రెస్ లీడర్. కాని, ట్విస్ట్ ఏంటంటే… ఒకవైపు ప్రణబ్ ముఖర్జీ తాను రెండోసారి రాష్ట్రపతి రేసులో వుండనని చెబుతోంటే మరో వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా అపొజిషన్ పార్టీలతో రాష్ట్రపతి అభ్యర్థి గురించి మీటింగ్ పెడుతున్నారు. కాంగ్రెస్ తో పాటూ చాలా పార్టీలు ప్రణబ్ తమకు ఓకే అని చెప్పాయి. కాని, మోదీ సర్కార్ ఎంత మాత్రం అలాంటి ఆలోచనలో లేదు! సోనియా ఎలాగైనా మోదీ ప్రతిపాదించే అభ్యర్థిపై తమ క్యాండిడేట్ ను పోటీకి నిలపాలని ప్రయతిస్తన్నారు. గెలవటం కోసం కాకపోయినా… ప్రతిపక్ష పార్టీలన్నిటికీ రాష్ట్రపతి ఎన్నికని అడ్డుపెట్టుకుని తాము నేతృత్వం వహించాలని కాంగ్రెస్ ప్లాన్. కాని, సోనియా ఎన్నో ఆశలు పెట్టుకున్న బెంగాల్ ఫైర్ బ్రాండ్ మమత కూడా మోదీతో మాటా మంతీ అయ్యాక టోన్ మార్చారు! ప్రతిపక్షాలకు కూడా అంగీకారమయ్యే అభ్యర్థిని ఎన్డీఏ ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామనీ, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే బెటరని దీదీ అన్నారు! ఎలాగైనా ఎలక్షన్ జరిగేలా చూసి… మోదీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోన్న సోనియాకి ఇది నిజంగా చిరాకు పరిచే స్టేట్మెంటే! అందరికీ అమోదయోగ్యం అయ్యే అబ్దుల్ కలామ్ లాంటి అభ్యర్థి అంటూ మమతా బెనర్జీ క్లాజులు పెట్టడం మోదీకి వెసులుబాటు కలిగించే అంశం! ఒడిషాకు చెందిన జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మూ లాంటి వారిని రేపు బీజేపి తమ అభ్యర్థిగా నిలబెడితే… మమతా బెనర్జీ ఆమె గిరిజన మహిళ అంటూ మద్దతు ప్రకటించవచ్చు! అప్పుడు కాంగ్రెస్ టీమ్ లోంచి ఓ కీలక వికెట్ పడిపోయినట్టే! కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడూ లేనంత బలహీనంగా వున్న వేళ వస్తోన్న ఈ రాష్ట్రపతి ఎన్నికలు ఖచ్చితంగా హస్తానికి తప్పనిసరి ఓటమే అవ్వనున్నాయి!
http://www.teluguone.com/news/content/president-elections-2017-45-75086.html





