జగన్ ఆఫర్ కు అదానీ గ్రూప్ నో! రాజ్యసభ సీటు వద్దని స్పష్టీకరణ
Publish Date:May 15, 2022
Advertisement
ఏపీ సీఎం జగన్ ఆఫర్ ను గౌతమ్ అదానీ ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది. ఎపీ నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ అదానీ భార్య ప్రీతీ అదానీని రాజ్యసభకు ఎంపిక చేయడానికి జగన్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించినట్లు ఆదానీ గ్రూప్ విస్పష్టంగా ప్రకటించింది. తాను కానీ తన సతీమణి ప్రీతీ అదానీ కానీ ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని గౌతమ్ అదానీ అధికారికంగా ప్రకటించారు. ఏపీ కోటాలో వైసీపీ అభ్యర్థిగా తన సతీమణి రాజ్యసభకు వెళ్లబోతున్నారన్న ప్రచారానికి ఈ ప్రకటనతో ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. వైసీపీ అభ్యర్థిగా తన భార్య రాజ్యసభ కు వెడతారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చేశారు. ప్రీతీ అదానీ అభ్యర్థిత్వం విషయంలో జగన్ ఆఫర్ ను అదానీ గ్రూప్ తిరస్కరించడానికి కారణాలేమిటన్నది వెంటనే స్పష్టంగా తెలియరాక పోయినప్పటికీ.. ఆ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ తీసుకుంటే గ్రూప్ బ్రాండ్ ఇమేజ్ కు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి చాలా ముందుగానే జగన్ ఈ ఆఫర్ ఇచ్చినప్పటికీ.. ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల షెడ్యుల్ విడుదలైన తరువాత ఆ ఆఫర్ ను అదానీ గ్రూప్ తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సిఫారసు మేరకే జగన్ గౌతమ్ అదానీ భార్య ప్రీతీ అదానీకి వైసీపీ తరఫున రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఇప్పుడు అదానీ గ్రూప్ ఆ ఆఫర్ తిరస్కరించడంతో జగన్ పార్టీ ఆఫర్ ను తిరస్కరించడానికి కారణాలపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వాలంటే వైసీపీలో చేరాలన్న షరతు నచ్చకే అదానీ ఈ ఆఫర్ తిరస్కరించారన్నది కొందరి భావన అయితే.. ఏపీలో వైసీసీ సర్కార్ పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగా, ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైతే అదానీ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ తగులుతుందన్న భావనతోనే రిజెక్ట్ చేశారని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ ఆఫర్ ను అదానీ తిరస్కరించడం నిస్సందేహంగా వైసీపీ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నది నిర్వివాదాంశం.
http://www.teluguone.com/news/content/preeti-adani-rejects-jagan-rajya-sabha-seat-offer-25-135911.html





