ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం
Publish Date:Jan 8, 2026
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఈ కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితులతో పాటు శ్రవణ్ కుమార్‌కు కూడా నల్లగొండ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం.. శ్రవణ్ కుమార్ వయసును, ఆయన ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. వేర్వేరు కులాలకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, అమృత వర్షిణిలు పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన కుమార్తె తక్కువ కులస్తుడిని పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించిన అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ను అంతం చేయడానికి కోటి రూపాయల సుపారీతో కిరాయి హంతకులను నియమించాడు. 2018 సెప్టెంబర్ 14న, గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, ఆమె కళ్ల ముందే కిరాయి హంతకుడు ప్రణయ్ మెడపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. సిసిటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు అప్పట్లో కలకలం రేపాయి. ఈ కేసులో మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, హంతకుడు సుభాష్ శర్మతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ దశలో ఉండగానే, 2020 మార్చిలో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నిందితులకు నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది
http://www.teluguone.com/news/content/pranays-honor-killing-case-36-212236.html





