రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.!
Publish Date:Jul 18, 2026
Advertisement
చేనేత రంగ అభ్యున్నతికి, పద్మశాలీల సంక్షేమానికి అవిరళ కృషి చేసిన నాయకుడు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి, ఆ వర్గాల ఆరాధ్యుడైన ప్రగడ కోటయ్యకు సముచిత గౌరవం కల్పించే దిశగా ఈ కీలక అడుగు వేసింది. ప్రతి ఏటా జులై 26న ఆయన జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పండుగగా, అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు, సమన్వయ బాధ్యతలను పరిశ్రమలు, వాణిజ్య శాఖకు అప్పగించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి సవిత స్వాగతించారు. చేనేత పరిశ్రమ పురోగతి సాధించాలన్నా, నేత కార్మికుల జీవితాలలో వెలుగులు నిండాలన్నా ప్రగడ కోటయ్య చూపిన మార్గమే శరణ్యమని పేర్కొన్న ఆమె.. నేతన్నల గొంతుకగా అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆయన వినిపించిన వాణి చిరస్మరణీయమన్నారు. చేనేత సమాజానికి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి సవిత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, పద్మశాలీ సంఘాల నాయకులు మరియు ప్రగడ కోటయ్య అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రతి ఏటా జులై 26న కేవలం చేనేత సంఘాలకే పరిమితమైన ఈ వేడుకలు, ఇకపై ప్రభుత్వ కరచాలనంతో అధికారిక వేదికలపై నిర్వహించనుండటం విశేషం. ప్రతి జిల్లా కేంద్రంలోనూ, చేనేత గ్రామాలు అధికంగా ఉన్న ప్రాంతాలలోనూ ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. Pragada Kotaiah, Pragada Kotaiah Birth Anniversary, Chandrababu Naidu, AP State Festival
http://www.teluguone.com/news/content/pragada-kotaiahs-birth-anniversary-as-state-festival-36-226347.html





