రాజకీయం సరే రాజనీతిజ్ఞత ఎక్కడ?
Publish Date:May 26, 2022
Advertisement
రాజకీయ నాయకులు రేపటి ఎన్నికల గురించి మాత్రమే అలోచిస్తారు, రాజ నీతిజ్ఞులు రేపటి తరం గురించి ఆలోచిస్తారని, అంటారు. అయితే, ప్రస్తుతం మనకు రాజకీయ నాయకులు కనిపించినంతగా, రాజనీతిజ్ఞులు కనిపించరు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందో వేరే చెప్పనక్కరలేదు. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నప్పుడు, ప్రోటోకాల్ ఉన్నా లేకున్నా ఆయనకు స్వాగతం పలకడం, రాష్ట్ర ముఖ్యమంత్రి పాటించవలసిన కనీస మర్యాద. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రానికి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రోటోకాల్ ను పక్కన పడేసి, రాజకీయ యాత్ర మీద పక్కరాష్ట్రానికి వెళ్ళారు. అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయ నాయకుడే కానీ, రాజనీజ్ఞుడు కాదని తనకు తానే మరొక్క సారి నిరుపించుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచిన వెంటనే, అంతవరకు ఉద్యమ పార్టీగా ఉన్న తెరాస, ఇక పై ఫక్తు 16 అణాల రాజకీయ పార్టీగా ఉంటుందని ప్రకటించారు. ఇక అక్కడ నుంచి తెరాస ప్రస్థానం ఆ దశగానే సాగుతోంది. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకులు తెరమరుగై పోయారు. అప్పట్లో ఉద్యమ ద్రోహులుగా, తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసుకున్న తలసాని, ఎర్రబెల్లి, సబిత ఇంద్రారెడ్డి ఇత్యాదిగా గల ఇతర పార్టీ;ల నాయకులకు కేసీఆర్ పార్టీలో, పదవుల్లో పెద్ద పేట వేశారు. ఆ విధంగానూ, ముఖ్యమంత్రి కేసీఆర్, తానేమిటో మరోసారి రుజువు చేసుకున్నారు. నిజమే, కేసీఆర్ కానీ, మరొకరు కానీ, రాజకీయంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు, నిజానికి, రాజకీయ ఆశలు లేని రాజకీయ నాయకులు ఎవరూ ఉండరు. కేసీఆర్’కు ప్రధాని కుర్చీమీద ఆశ ఉండడం తప్పుకాదు, అలాగే మంత్రి కేటీఆర్’కు ముఖ్యమంత్రి కుర్చీ మీద ఆశ ఉంటే అదీ తప్పు కాదు. అదే ఆశ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితకు ఉన్నా అందులో అవగింజలో అరవయ్యో వంతు తప్పుందని ఎవరూ అనరు.. అనలేరు.అయితే, ముఖ్యమంత్రి పీఠం నుంచి ప్రదాని కుర్చీకి నిచ్చెనలు వేస్తున్న కేసీఆర్, ప్రస్తుత హోదాకు కాసింత గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదని, పరిశీలకులు, ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ వైరం కారణంగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేర్పాటువాద నాయకుడి తరహాలో, సమాఖ్య స్పూర్తిని చిన్నబుచ్చడం రాజకీయంగానే కాదు రాజ్యాంగ పరంగాను తప్పిదమే అవుతుందని విజ్ఞులు, విమర్శకులు అంటున్నారు. అంతే కాకుండా, రచ్చ రచ్చగా మారిన ప్రస్తుత రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ప్రతి చిన్న విషయం, థాంక్స్ టూ సోషల్ మీడియా, పబ్లిక్ టాకై కూర్చుంటోంది.ఈ నేపధ్యంలో, ముఖ్యమంత్రి ప్రధాని అధికార పర్యటనను ఇగ్నోర్ చేయడం సామాన్య పబ్లిక్’కే కాదు తెరాస నాయకులు, క్యాడర్’కు కూడా అంతగా రుచించడం లేదు. మాజీ ప్రధాని దేవెగౌడను, ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ఈరోజు కాకపోతే రేపు కలసినా పెద్దగా, తేడా ఉండదు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయ విధానం, కూటమిని ఏర్పాటు చేయడం ఒక రోజుతో అయ్యే పని కాదు.అలాటప్పుడు, ఆ సాకున, ప్రధాని పర్యటనలో మర్యాద పాటించక పోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని తెరాస నాయకులే అంటున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రోటోకాల్ నిబంధనలు అయినా పాటించక పోవడం రాష్ట్ర ప్రతిష్టను సైతం దిగాజారుస్తుందని అంటున్నారు. “ముఖ్యమంత్రి జాతీయ ప్రత్యాన్మాయ విధానాలు, కూటమి ఏర్పాటుకు చేస్తున ప్రయత్నాలను ఎవరూ కాదనరు. అయితే, అందుకు ఎంచుకున్న సమయం విషయంలోనే అనుమానాలు వ్యక్తమావుతున్నాయి” అని తెరాస నాయకులు కూడా అంటున్నారు. ముఖ్యంగా ప్రధానిని కలిసేందుకు ముఖ్యమంత్రి ఎందుకో భయపడుతున్నారనే ప్రచారం జరగడం పార్టీ ప్రతిష్టనే, కాకుండా రాజకీయంగా పార్టీ ప్రయోజనాలనూ దెబ్బ తీస్తుందని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి మాత్రం తగ్గేదేలే’ అంటూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాలు, రాజ్యంగం, రాజనీతి మధ్యగల వ్యత్యాసాన్ని తోసిరాజని, ముందుకు సాగుతున్నారు. బహుశా ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు బెంగాల్ దీదీ బాటలో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు, కావచ్చును, కానీ, బెంగాల్ ఫార్ములా తెలంగాణలో పనిచేస్తుందా? అక్కడ మమత సాధించిన హ్యాట్రిక్ విజయం ఇక్కడా వర్క్ అవుట్ అవుతుందా? చూడాలి కాలమే సమాధానం చెప్పాలి, అంటున్నారు పరిశీలకులు.
http://www.teluguone.com/news/content/politics-ok-where-is-diplomacy-25-136474.html





