సంపులో కోటి రూపాయల నోట్లు.. ఐటీకి అడ్డంగా దొరికిన రాజకీయ నేత
Publish Date:Jan 9, 2022
Advertisement
అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యాపారులు, రాజకీయ నేతలు, ఉద్యోగులు... ఆ డబ్బును దాచడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తుంటారు. పైప్ లైన్లలో నోట్ల కట్టలు దాచిపెట్టిన ఓ అవినీతి అధికారి బండారం ఇటీవలే బయటపడింది. కొందరు అక్రమంగా విదేశాలను తరలిస్తారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. బినామీల దగ్గర దాచిపెట్టే వాళ్లు ఇంకొందరు. అయితే అవినీతిపరులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు పట్టుబడుతూనే ఉంటారు. తాజాగా సంపులో కోట్లాది రూపాయల నోట్ల కట్టలను దాచేసి అడ్డంగా దొరికిపోయాడో రాజకీయనాయకుడు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులో దాచి ఉంచిన రూ. కోటి క్యాష్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టుకున్నారు. రాజకీయ నేత ఇంట్లో దొరికిన తడిసిపోయిన నోట్లను స్వాధీనం చేసుకుని హెయిర్ డ్రయ్యర్లతో ఆరబెట్టి, ఇస్త్రీ చేశారు ఆదాయపన్ను శాఖ అధికారులు. మధ్యప్రదేశ్ లోని దామో జిల్లాలో జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ రాయ్ అనే వ్యాపారి ఇంట్లో లెక్కల్లోకి రాని డబ్బు గురించి సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.కోటి విలువైన నోట్ల కట్టలను సంపులో దాచినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. సంపులో దాచిన ఆ నోట్ల కట్టల బ్యాగును బయటకు తీసిన అధికారులు.. తడిసిపోయిన నోట్లను డ్రయ్యర్ తో ఆరబెట్టారు. ఇస్త్రీ కూడా చేశారు. ఈ దాడుల్లో శంకర్ రాయ్ నుంచి మొత్తం 8 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉయదం 5 గంటల నుంచి దాదాపు 39 గంటల పాటు ఈ సోదాలు జరిగినట్టు రెయిడ్స్ కు నేతృత్వం వహించిన జబల్ పూర్ ఐటీ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ చెప్పారు.రాయ్ ఫ్యామిలీ మూడు డజన్లకుపైగా బస్సులను ఉద్యోగుల పేరిట నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. వారి ఆస్తుల గురించి మరింత సమాచారం ఇస్తే రూ.10 వేల నజరానా ఇస్తామని ప్రకటించారు. శంకర్ రాయ్ కాంగ్రెస్ పార్టీ తరఫున దామో నగర పాలిక చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు కమల్ రాయ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
http://www.teluguone.com/news/content/politician-dump-cash-in-under-ground-water-tank-39-129917.html





