మాటలేనా.. చేసేదేమన్నా ఉందా..?
Publish Date:Nov 1, 2017
Advertisement
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు అవినావభావ సంబంధాలే ఉన్నాయి. ఎందుకంటే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినవాళ్లే. ఓ రకంగా తెలుగు తనానికి గౌరవం తీసుకొచ్చిన ఎన్టీఆర్ సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రభంజనం సృష్టించారు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు. ఇక తమిళనాడులో ఏంజీఆర్ కూడా అన్నాడీఎంకే పార్టీని స్థాపించి.. పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేశారు. ఇలా సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లు చాలమందే ఉన్నారు. అయితే ఇది ఒకప్పుడు సంగతి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరికి వారు పార్టీ పెడుతున్నామని ప్రకటించేసుకోవడం.. రెండు మూడు సంవత్సరాలు ఎలాగో పార్టీని లాక్కురావడం.. ఆతరువాత చేతులేత్తేయడం ఆనవాయితీగా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కానీ.. విలక్షణ నటుడు కమల్ హాసన్ తాము సైతం రాజకీయాల్లోకి వస్తున్నామని ప్రకటించారు. చెప్పడమైతే ఎప్పుడో చెప్పారు కానీ.. ఇంతవరకూ దానిని ఆచరణలో పెట్టింది మాత్రం లేదు. ఇక కన్నడతో పాటు తెలుగు నాట అభిమానులను సంపాదించుకున్న ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)’ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రానికి వస్తే మెగా స్టార్ గా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న చిరంజీవి పార్టీ పెట్టి.. ఆతరువాత వేరే పార్టీలో విలీనం చేశాడు. ఇక అన్నబాటలోనే ఇప్పుడు తమ్ముడు కూడా సొంత పార్టీ పెట్టాడు. జనసేన పేరుతో ప్రజలకు సేవచేయాలని పవన్ ఈ పార్టీ పెట్టాడు. పెట్టడానికి పెట్టాడు కానీ... ఇంకా పార్టీకి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. దాని ఫలితం ఏంటో వచ్చే ఎన్నికల్లో కానీ తెలియదు. మరి ఒక ఎన్టీఆర్ కానీ.. ఎంజీఆర్ కానీ ఏదో నామ్ కే వాస్త్ పార్టీని పెట్టలేదు. పార్టీని పెట్టి.. ప్రజలకు కాస్తో, కూస్తో సేవ చేశారు కాబట్టే గొప్పవాళ్లు అయ్యారు. ఇక ఈనాటి సూపర్ స్టార్స్ రాజకీయాల్లోకి వస్తున్నామని మాటలైతే చెబుతున్నారు కానీ.. ప్రజలకు సేవ ఎంత మాత్రం చేస్తారో దేవుడికే ఎరుక. చూద్దాం... మాటలేనా... చేతలు ఏమైనా ఉన్నాయో..
http://www.teluguone.com/news/content/political-updates-39-78583.html





