చినజీయర్ ఇమేజ్ డ్యామేజ్?.. కేసీఆర్ టార్గెట్ చేశారా?
Publish Date:Mar 17, 2022
Advertisement
“నిజంగా కూడా చిన జీయర్ చేసిన వ్యాఖ్యలు, ‘ఏకం సత్ విప్రః బహుదా వదంతి (సత్యం ఒకటే, ఆది చేరుకునే మార్గాలు మాత్రమే విభిన్నంగా ఉంటాయి) అన్న భారతీయ హిందూ సంస్కృతికి భిన్నంగా, ఉన్నాయి.” చిన జీయర్ స్వామి, ఒక్క తెలంగాణలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ స్వామీజీలలో ఒకరు. తెలంగాణలో అయితే ఆయన తర్వాతనే ఇంకెవరైనా. నిజానికి తెలంగాణలో ఇటు రాజకీయాలతో, రాజకీయ నాయకులతో, వ్యాపార ప్రముఖులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న స్వామీజీ ఎవరైనా ఉన్నారంటే, చిన జీయర్ స్వామి ఒక్కరి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. అదొకటి అలా ఉంటే, చిన జీయర్ స్వామి చేసే వివాదస్పద వ్యాఖ్యలు కూడా ఆయన్ని ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలబెడుతున్నాయి. ముఖ్యంగా ముచ్చింతల్’లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపధ్యంగా, ముఖ్యమంత్రి కేసీఆర్’తో దూరం పెరిగిన నేపధ్యంలో,ఆయన ఇప్పుడు ఫ్రెష్’ గా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటుగా గతంలో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇప్పుడు తాజాగా, మేడారం వనదేవతలు సమక్క, సారలమ్మలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వన దేవతలను అవమానించే విధంగా ఉన్నాయని, మేడారం జాతరను హేళన చేసే విధంగా ఉన్నాయని., భక్తుల విశ్వాసాలను, ఆదివాసీ సంస్కృతిని తూలనాడే విధంగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ప్రాంతం, రాష్ట్రం ఏదైనా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గ్రామా దేవతలను కొలవడం, మొక్కులు తీర్చుకోవడం తరతరాలుగా ఆచారంగా వస్తోంది. అందులో తెలంగాణలో సమక్క, సారలమ్మల జాతర గురించి అయితే చెప్పనే అక్కరలేదు. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా వస్తున్నారు అంటే, ఇక స్థానిక ప్రజల విషయం చెప్పనే అక్కర లేదు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతు వీడియోలోచిన జీయర్’ “‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ.. దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగొచ్చిన వారా? ఏమిటీ చరిత్ర ? అదేదో ఒక అడవి దేవత. ఏదో గ్రామ దేవత. చదువుకున్నవాళ్లు.. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆ పేర్లతో బ్యాంకులు పెట్టేశారు. దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ (అది ఇప్పుడో వ్యాపారమైపోయింది)’’ అని అన్నారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలపై ఆదివాసీ భక్తులు, వివిధ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. చినజీయర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ నేత నారాయణ, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. మేడారంలో అక్కడి పూజారుల సంఘం ఆధ్వర్యంలో చినజీయర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండవేశారు. సీతక్క అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. నిజానికి ఈ ఒక్క విషయంలోనే కాదు చిన జీయర్ స్వామి గతంలోనో, ప్రజల ఆహారపుటల వాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాంసాహారులు ఏ జంతువును ఆహారంగా తీసుకుంటారో ఆ జంతువులా ప్రవర్తిస్తారన్నారు. పంది మాంసం తింటే పంది ఆలోచనలు, మేక మాంసం తింటే మేక ఆలోచనలు, కోడి మాంసం తింటే కోడి లాగా పెంటకుప్పల్లో ఏరుక తింటారని ఆయన ఉదాహరణలతో సహా చెప్పారు. ఈ విషయం దుమారం రేపింది. ప్రజల ఆహారపుటలవాట్లను ప్రశ్నించడానికి ఆయనెవరని పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, నిజానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన జీయర్ వివాదస్పద వ్యాఖ్యలు ఏవీ, ఇప్పుడు చేసినవి కాదు. నిజమే ఎప్పుడు చేసినా, అలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే, కాషాయం కట్టిన స్వామీజీ చేయడం మరింత తప్పు. అందులో, మరో అభిప్రాయం లేదు. అయితే, ఇప్పుడు ఆ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి? కావాలనే కొందరు వైరల్ చేస్తున్నారా? ఆ వీడియోల వెనుక కేసీఆర్ మనుషులు ఉన్నారా? చినజీయర్ స్వామి ఇమేజ్‌ని తగ్గించే క్రమంలోనే ఇలా వివాదాస్పద పాత వీడియోలను మళ్లీ కొత్తగా వైరల్ చేస్తున్నారా? ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచి కూడా చిన జీయర్ స్వామి, ముఖ్యమంత్రి కేసేఆర్ మధ్య చాలా చక్కని సంబంధాలే ఉంటూ వచ్చాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆ ఇద్దరి బంధం మరింత గట్టి పడింది. ముఖ్యమంత్రి అధికారికంగా, వ్యక్తిగతంగా నిర్వహించే యజ్ఞయాగాదులు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ చిన జీయర్ చేతుల మీదుగానే జరగడం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణ అలోచన మొదలు ఆచరణ వరకు అన్నిటా చినజీయర్ స్వామి కీలక పాత్రను పోషించారు. అయితే ఈ మధ్య కాలంలో, ఆ ఇద్దరి మధ్య దూరం పెరింగింది. ఆ దూరం ఎందుకు పెరిగింది అంటే అందుకు అనేక కారణాలున్నాయి. అయితే అది వేరే విషయం.
http://www.teluguone.com/news/content/political-storm-over-china-jeeyar-controversial-comments-39-133176.html





