రాజకీయ హీట్ ను పెంచనున్న తెలంగాణ ఆవిర్బావ వేడుకలు!
Publish Date:Jun 1, 2022
Advertisement
జూన్ 2 (గురువారం)తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ సమాజం ఘనంగా నిర్వహించుకుంటోంది. అలాగే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తమ తమ పార్టీల కార్యాలయాల్లో నిర్వహించుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజకీయ స్కోర్లు సెటిల్ చేసుకోవడానికి పార్టీలు వాడుకునేందుకు సన్నద్ధమౌతున్న పరిస్థితి కనిపిస్తున్నది. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకూ రంగులు మారుతున్న పరిస్థితి. ఒక వైపు కేసీఆర్ మౌనం, మరో వైపు బీజేపీ దూకుడు.. ఇంకో వైపు కాంగ్రెస్ స్పీడు వెరసి తెలంగాణలో రాజకీయ హీట్ సమ్మర్ ఉష్ణోగ్రతల రికార్డులను దాటేస్తోంది. ఇప్పుడు ముక్కోణపు రాజకీయ క్రీడకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేదిక కానుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పోటీపోటీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా తెలంగాణను ఇచ్చింది సోనియమ్మే అంటూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మౌనమే భాషగా మారిపోయిన కేసీఆర్ ఆవిర్భావ దనోత్సవ వేడుక వేదికగా తన గళాన్ని బలంగా వినిపిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పబ్లిక్ గార్డెన్స్ లో ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తుంటే.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు వేడుకలు నిర్వహించి రాష్ట్రంలో తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నాయి. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో నామమాత్రంగా జరిపిన వేడుకలు ఈ సారి మత్రం అట్టహాసంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ హీట్ ప్రభావం ఈ వేడుకలపై ప్రస్ఫుటంగా పడుతుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ, బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం కేసీఆర్ ప్రయత్నాలు, మరో వైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ . రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణతో ప్రజల అభిమానాన్ని చూరగొనాన్న సంకల్పంతో ఉన్నాయి. దీంతో అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ లో ఒకేసారి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. హస్తినలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరౌతారు. రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు. గత కొద్ది కాలంగా మౌనాన్ని ఆశ్రయించిన కేసీఆర్ ఆవిర్భావ వేడుక వేదికపై నుంచి ఏం ప్రసంగిస్తారన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది. అప్పులపై కేంద్రం ఆంక్షలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం తదితర అంశాలపై ఆయన మోడీ సర్కార్ లక్ష్యంగా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/political-heat-increase-with-telangana-formation-dat-celebrations-25-136804.html





