పరారీలో వర్రా రవీందర్ రెడ్డి... కడప పోలీసులపై చంద్రబాబు సీరియస్!
Publish Date:Nov 6, 2024
Advertisement
పోలీసులు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలే అనిపిస్తున్నది. సామాజిక మాధ్యమంలో ప్రత్యర్థి పార్టీల నాయకులపై ఇష్టారీతిగా, అడ్డగోలుగా అసభ్య పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు చేసి విడిచి పెట్టేశారు. 41ఎ నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు విచారణకు రావలని చెప్పి గౌరవంగా సాగనంపారు. అలా సాగనంపడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ప్రభుత్వ ఆగ్రహంతో వర్రాను అదుపులోనికి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు అతడి ఆచూకీ చిక్కడం లేదు. పోలీసులు ఇలా వదిలిపెట్టగానే వర్రా రవీంద్రారెడ్డి అలా పరారైపోయారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ, కూటమి అధికారం లోకి వచ్చిన తరువాతా కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నాయకురాళ్లపై అసభ్య పోస్టులు పెట్టారు. పలు ఫిర్యాదుల మేరకు పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిని మంగళవారం రాత్రి అరెస్టు చేసి కడపకు తరలించి విచారించారు. అయితే బుధవారం తెల్లవారు జామున ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడం చూస్తుంటూ వారింకా వైసీపీ అనుకూల మోడ్ లోనే ఉన్నారని అనిపించక మానదు. వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల సహా పలువురు అప్పటి విపక్ష నేతలపై వర్రా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అటువంటి వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు 41ఎ నోటీసులు ఇచ్చి వదిలేయడం ఎవరి ఆదేశాల మేరకు, ఎవరికి అనుకూలంగా పోలీసులు పని చేస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. వర్రా రవీందర్ రెడ్డిని వదిలేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వర్రా రవీందర్ రెడ్డిని అలా ఎలా వదిలేశారంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు సైతం కడప పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కడప పోలీసులు అలర్టై వర్రా రవీందర్ రెడ్డి కోసం గాలింపు ప్రారంభించారు. అయితే పోలీసుల విడిచి పెట్టిన మరుక్షణమే వర్రా రవీందర్ రెడ్డి పరారీ అయ్యారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వర్రా రవీందర్ రెడ్డి పరారీ విషయం తెలుసుకున్న వెంటనే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప ఎస్పీ కార్యాలయాలని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇలా ఉండగా వర్రా రవీందర్ రెడ్డికి 41ఎ కింద నోటీసులు ఇచ్చిన కడప పోలీసులు విచారణకు పిలిచినప్పుడు రావాలని ఆదేశించారు. ఆ వెంటనే మరో కేసులో విచారణ కోసం అదుపులోనికి తీసుకో వాలని భావించినప్పటికీ అప్పటికే వర్రా పరారయ్యాడు. వర్రా ఆచూకీ కోసం ఆతని భార్య, సోదరుడు, మరదలును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డిపై మంగళగిరి, పులివెందుల, హైదరా బాద్‌లలో పలు కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా అతడిని విడిచిపెట్టడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/police-leave-varra-ravinder-reddy-39-187968.html