పంజాబ్ లో ఇదే జరిగింది.. రాష్ట్రపతికి వివరించిన ప్రధాని
Publish Date:Jan 6, 2022
Advertisement
ప్రధాన మంత్రి నరేందర్ మోడీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై దేశ వ్యాప్తంగా ఆందోళన, రాజకీయ చర్చ జరుగతున్న నేపధ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రదాన మంత్రి పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పంజాబ్ సంఘటన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. పంజాబ్ పర్యటనకు బుధవారం వెళ్లిన మోడీ కాన్వాయ్ ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో ఆకస్మికంగా ర్యాలీని రద్దు చేసుకుని ప్రధాని ఢిల్లీ చేరిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తటంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా చర్యలపై పఠిష్ఠ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా లోపాల వ్యవహరం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్ మనిందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ప్రధాని పర్యటనల్లో భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా.. పిటిషన్ కాపీలను కేంద్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వాలకు గురువారమే పంపించాలని న్యాయవాదికి సూచించింది సుప్రీం కోర్టు. పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మరోవంక ప్రధాని నరేంద్రమోదీ ఫిరోజ్‌పుర్ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మెహ్‌తాబ్, న్యాయ, హోంశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాగ్‌వర్మ ఈ దర్యాప్తు బృందంలో ఉన్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కమిటీ 3రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.పంజాబ్లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు అశ్వినీ శర్మ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆరోపించారు. అశ్వినీ శర్మ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బీజేపీ బృందం ప్రధాని మోడీ పర్యటనలో భద్రతాలోపాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసింది రాజ్భవన్కు వెళ్లి వినతిపత్రం సమర్పించింది.ప్రధానమంత్రి భద్రత విషయంపై వివాదం చెలరేగటం చాలా దురదృష్టకరమన్నారు మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్డీ దేవే గౌడ. దేశ అత్యున్నత వ్యక్తుల భద్రత అంశంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అంశాల నుంచి నేర్చుకోవాలని సూచించారు.
http://www.teluguone.com/news/content/pm-modi-meet-president-kovind-over-punjab-incidents-39-129736.html





