శాస్త్రవేత్తల సరికొత్త సృష్టి – పంది మనిషి
Publish Date:Jan 27, 2017
Advertisement
అమెరికాలోని Salk Instituteకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మనిషికి అవసరమయ్యే అవయవాలు ఇతర జంతువుల ద్వారా ఉత్పత్తి చేయడం సాధ్యమేనా! అని తేల్చడమే ఈ పరిశోధన లక్ష్యం. ఇందుకోసం వారు ముందు కొన్ని ఎలుకల మీద తమ ప్రయోగాన్ని మొదలుపెట్టారు. దీనికొసం ముందు ఎలుకలలో పాంక్రియాలకి (క్లోమం) సంబంధించిన కణాలను తొలగించారు. శరీరంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి చక్కెరను అదుపు చేయడంలో ఈ క్లోమానిది ముఖ్య పాత్ర అని తెలిసిందే! ఇలా తొలగించిన తరువాత వేరే ఎలుకలో పాంక్రియాలకు సంబంధించిన మూలకణాలను తీసుకుని ఎక్కించారు. ఫలితంగా పాంక్రియాలు లేని ఎలుకలలో కొత్త పాంక్రియాలు రూపొందాయి. మొదటి పరిశోధన విజయవంతం అయిన తరువాత ఇదే సూత్రాన్ని మనుషులకు అన్వయించే ప్రయత్నం చేశారు. దీనికోసం మనుషుల అవయవాలకు సంబంధించిన మూలకణాలను పందుల అండంలో ప్రవేశపెట్టారు. ఇలా మానవ కణాలతో కూడిని 2,075 అండాలలో దాదాపు రెండు వందల సందర్భాలలో పంది శరీరంతో పాటుగా మనిషి శరీరానికి సంబంధించిన కణాలు కూడా అవయవాల కింద వృద్ధి చెందడాన్ని గమనించారు. పంది శరీరంలో మనిషి అవయవాలను ఉత్పత్తి చేయడం సాధ్యమేనా కాదా అని తెలుసుకోవడమే ఈ పరిశోధన లక్ష్యం కాబట్టి... 28 రోజులకే ఈ పరిశోధనను నిలిపివేశారు. ఎందుకంటే నిజంగానే మనిషి అవయవాలతో పంది శరీరాన్ని రూపొందించేస్తే అది నైతికతకు సంబంధించి అనేక వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పరిశోధనకు ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి నిధులూ అందించలేదు. పైగా విజ్ఞానప్రపంచంలో ప్రప్రథమంగా జరిగిన ఈ పరిశోధన మీద ఇప్పటికే విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలా చేయడం ప్రకృతికి విరుద్ధమని కొందరు వాదిస్తే, ఇలాంటి పరిశోధనల ద్వారా మున్ముందు మానవమృగాలను సృష్టించే ప్రమాదం ఉందని మరికొందరు భయపడుతున్నారు. రోజురోజుకీ గుండె, మూత్రపిండాలు, క్లోమం, కాలేయం వంటి అవయవాలు అవసరమయ్యే రోగుల సంఖ్య పెరిగిపోతోంది. వీరికి తగిన అవయవాలు అందించే దాతలు లభించకపోవడం వల్ల ఏటా లక్షలాదిమంది చనిపోతున్నారు. అదే పందులలో కనుక వీరికి కావల్సిన అవయవాల మూలకణాలను ప్రవేశపెడితే... కేవలం మూడంటే మూడు నెలలలో సరికొత్త అవయవం రూపొందే అవకాశం ఉంది. కాబట్టి మున్ముందు పందుల ద్వారా మానవ అవయవాలను ఉత్పత్తి జరగాలనే డిమాండ్ పెరగక తప్పదు. అప్పుడు ఇదే పరిశోధన ముందుకు సాగకా తప్పదు! అది మరి ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే! - నిర్జర.
పురాణాలలో సగం మనిషి. సగం మృగంతో కూడిన పాత్రలు మనకి అడుగడుగునా కనిపిస్తాయి. కానీ నిజజీవితంలో అలాంటి జీవులు ఎదురుపడితే! బహుశా మున్ముందు అలాంటి రోజులు కూడా వస్తాయేమో! అందుకే మనిషి కణాలతో రూపొందిన ఈ పరిశోధన ఇప్పుడు విజ్ఞాన ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది.
http://www.teluguone.com/news/content/pigman-34-71510.html





