అన్నా చెల్లెళ్ల ఆస్తి వివాదంలో పేర్ని నాని తీర్పేమిటో?
Publish Date:Oct 26, 2024
Advertisement
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపీపీసీసీ అధినేత్రి, జగన్ సోదరి షర్మిల మధ్య ఆస్తుల వివాదంలో రోజుకో ట్విస్ట్ బయలకు వస్తోంది. ఆస్తుల వివాదంపై అన్నాచెల్లెళ్ల వాదనకు భిన్నంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని జగన్ వాదనను ఖండించేలా ఆయనకు మద్దతుగా ఆయనకే తెలియని విషయాలు వెల్లడిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించక ముందే ఆయన పిల్లలకు ఆస్తులు పంచారని మాజీ మంత్రి పేర్నినాని బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల కోరుతున్న ఆస్తులన్నీ జగన్ స్వార్జితమని తీర్పిచ్చేస్తున్నారు. శుక్రవారం (అక్టోబర్ 25) తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడిన పేర్నినాని.. వైఎస్ బతికుండగానే జగన్‌కు, షర్మిలకు ఎవరికి ఇచ్చే ఆస్తులను వారికి సవివరంగా రాసిచ్చారని తెలిపారు. జగన్ కంపెనీలలో షర్మిల ఎంత మాత్రం షేర్ హోల్డర్ కాదనీ చెప్పారు. అసలు వైఎస్ కుటుంబంలో అన్నాచెల్లెళ్ల ఆస్తుల గొడవ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను మంటగలిపేలా జగన్ తీరు ఉందని వైఎస్ అభిమానులు బాహాటంగానే చెబుతున్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి షర్మిల ఇల్లూ వాకిలీ వదిలేసి మరీ పాదయాత్ర చేశారనీ, తీరా వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చెల్లిని దూరం పెట్టారనీ వైసీపీ శ్రేణులే కాదు, వైఎస్ అభిమానులూ గుర్తు చేసుకుంటున్నారు. దీంతో అన్నా చెల్లెళ్ల ఆస్తి వివాదం కుటుంబ వ్యవహారం స్టేజి దాటిపోయింది. దీనిపై బహిరంగ చర్చలే జరుగుతున్నాయి. ఆస్తుల గొడవలు కుటుంబాలలో సహజమే, ఇది మా వ్యక్తిగత వివాదం అంటూ జగన్ దీనిని తేలికగా కొట్టిపాడేయడానికి ప్రయత్నిస్తుంటే.. షర్మిల మాత్రం జగన్ కు గట్టి కౌంటర్ ఇస్తూ, తనకు జగన్ అన్యాయం చేశారని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు షర్మిల, జగన్ లమధ్య చిచ్చుకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలను ఖండిస్తూ షర్మిల అన్నకు బహిరంగ లేఖ రాశారు. దీంతో పేర్ని నాని జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చేశారు. జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికే చంద్రబాబు, షర్మిలను పావుగా వాడుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు జగన్ ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు కొత్తగా షర్మిల వివాదాన్ని బయటకు తీసుకురావడం ఎందుకు.. ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీని జనం 11 స్థానాలకు పరిమితం చేసినప్పుడే ఆయన రాజకీయంగా జీరో అని తేలిపోయిందని తెలుగుదేశం వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. జగన్ అధికారం చేపట్టిన తరువాత ముందు షర్మిలను, ఆ తరువాత తల్లి విజయమ్మను పార్టీ నుంచి బయటకు పంపేసిన విషయం పేర్ని నానికి గుర్తు లేదా అని నిలదీస్తున్నారు. జగన్ కోసం, ఆయనను ముఖ్యమంత్రిని చేయడం కోసం చెల్లి షర్మిల, తల్లి విజయమ్మలను అధికారంలోకి రాగానే జగన్ ఎలా పక్కన పెట్టేశారో, ఆంధ్రప్రదేశ్ వీడి పొరుగురాష్ట్రంలో తలదాచుకోవలసిన పరిస్థితి కల్పించారో తెలియదా అని ప్రశ్నించారు. అంతెందుకు జగన్ కోసం ఆయన ప్రాపకం కోసం ఉచ్ఛనీచాలు, మంచి చెడ్డలూ వదిలేసి ఇష్టారీతిగా చెలరేగి.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై, పవన్ కల్యాణ్ పై నోటికొచ్చినట్లల్లా మాట్లాడిన బోరుగడ్డ ప్రసాద్ ను జగన్ ఎలా వదిలించుకున్నారో కనిపించడం లేదా? అని నిలదీస్తున్నారు. అయినా ఓ పక్క జగన్ సొంత చెల్లి, వైఎస్ కన్నబిడ్డ షర్మిల.. ఇది మా తండ్రి ఆస్తి, నలుగురు మనవలకూ సమానంగా పంచాలన్నది ఆయన అభిమతం. అందుకే నా ఈ పోరాటం అని విస్పష్టంగా చెబుతుంటే.. ఆ కుటుంబంతో ఏం సంబంధం లేని పేర్ని నాని ఆ అస్తులు జగన్ స్వార్జితం అని ఎలా తీర్పు ఇచ్చేస్తారనీ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పేర్ని నాని రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తుంటే.. వైసీపీ శ్రేణులే త్వరలో పేర్ని నాని మరో బోరుగడ్డ ప్రసాద్ లా మారడం ఖాయమని.. ఆయన భవిష్యత్ అలాగే కనిపిస్తోందనీ సెటైర్లు వేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/perni-nani-judgement-in-sharmila-and-jagan-assets-dispute-25-187430.html