బుక్ పోస్ట్ సర్వీసు రద్దు
Publish Date:Dec 25, 2024
Advertisement
భారత తపాలా శాఖ బుక్ పోస్టు సర్వీసులను రద్దు చేసింది. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుక్ పోస్టు సర్వీసులను తపాలా శాఖ రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్తృతమైన వ్యవస్థ ఉండి దేశంలో 19,101 పిన్ కోడ్ లతో 1,54,725 పోస్టాఫీసులఉన్న తపాలా శాఖ తన నెట్ వర్క్ ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. బుక్ చేసిన పార్ట్ళిళ్లు వారం లోపు బట్వాడా అవుతున్నాయి. నగర పరిధికి పరిమితమైన స్థానిక బట్వాడాలు ఆమరుసటి రోజుకే చేరుతున్నాయి. అయితే లాభాపేక్షతో సంబంధం లేకుండా ప్రజలలో పఠనాశక్తి పెంచే ఉద్దేశంతో దశాబ్దాలుగా కొనసాగిస్తున్న బుక్ పోస్ట్ సర్వీసులను హఠాత్తుగా రద్దు చేయడం విస్మయం కలిగిస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి పోస్టల్ డిపార్ట్ మెంట్ తన సర్వీసుల నుంచి బుక్ పోస్ట్ లను తొలగించింది. కచ్చితంగా ఇది పుస్తక ప్రియులకు, పుస్తక ప్రచురణలకు షాక్ అనడంలో సందేహం లేదు. బుక్ పోస్ట్ సర్వీసును ఉదాత్తమైన ఆలోచనతో మొదలు పెట్టారు.విద్యను ప్రోత్సహించడం, పఠనాభిలాషను పెంపొందింప చేయడం,దేశ వ్యాప్తంగా జ్ఞానాన్నివిస్తరింప చేయడం లక్ష్యంగా ప్రారంభించిన ఈ సర్వీసు రద్దు చేయడం ఎంత మాత్రం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ (ఆర్.బి.పి.)సర్వీసు ద్వారా 5 కిలోల బరువున్న పుస్తకాలను దేశంలోని ఏమారు మూల ప్రాంతానికైనా కేవలం 80 రూపాయల ఖర్చుతో పంపించే అవకాశం ఉన్న ఈ సర్వీసును రద్దు చేయడం దారుణమని పుస్తక ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడం లక్ష్యంగాతపాలా శాఖ ఈ సర్వీసును నడిపేది. అతి తక్కువ రేట్లతో బుక్ పోస్ట్ ద్వారా పుస్తకాలు, మాగజైన్లు, పీరియాడికల్స్ దేశంలోని నలుమూలలకూ పంపిణీ చేయడానికి ఉన్న అవకాశాన్ని తపాలా శాఖ లేకుండా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత ఆదరణ పొందిన ఈ సర్వీసును రద్దు చేయాలన్న నిర్ణయం తపాలా శాఖ ఏకపక్షంగా తీసుకోవడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు పుస్తక పరిశ్రమ, చదువరుల అభిప్రాయాలను తెలుసుకుని ఉండాల్సిందని అంటున్నారు. అవసరమైతే స్వల్పంగా చార్జీలు పెంచి అయినా సరే ఈ సర్వీసును కొనసాగించాలని కోరుతున్నారు.
రిజిస్టర్ బుక్ పోస్ట్ కేటగిరిని తపాలా శాఖ తన సాఫ్ట్ వేర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తీసేసింది. కనీసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు కూడా ఈ విషయాన్ని ముందుగా తెలియపరచలేదు. దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పుస్తకాలను రిజిస్టర్ బుక్ పోస్టులో పంపడానికి వెళ్లిన వందలాది మంది ప్రచురణ సంస్థల సిబ్బంది ఇక ఈ సర్వీసు అంగుబాటులో లేదని తెలుసుకుని నిర్ఘాంత పోయారు. పలు చోట్ల పోస్టల్ సిబ్బందిని నిలదీసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బుక్ పోస్టు సర్వీసును రద్దు చేయడం ప్రచురణ రంగానికి తీరని నష్టం అనడంలో సందేహం లేదు. ఇప్పటికే పఠనాసక్తి కొరవడి, పుస్తక పరిశ్రమ నష్టాల్లో కునారిల్లుతోంది. మూలిగే నక్కపై తాటిపండు చందంగా ఇప్పుడు తపాలాశాఖ తీసుకున్న నిర్ణయం పబ్లిషింగ్ ఇండస్ట్రీని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసిందని పరిశీవలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/postal-department-caciled-bookpost-service-25-190317.html