ఈ డెవడండీ బాబూ! జగన్ సర్కార్ తీరుపై జనం సెటైర్లు
Publish Date:Jun 11, 2022
Advertisement
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి.. అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినా నివ్వదు అన్న చందంగా.. ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మంగళగిరిలో అన్నా క్యాంటిన్‌ను పోలీసుల సమక్షంలోనే మున్సిపల్ అధికారులు ధ్వంసం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతిది రాజకీయ కోణంలోనే చూడడం.. జగన్ ప్రభుత్వ స్పెషాలిటి అని మంగళగిరి జనం సెటైర్లు వేస్తున్నారు. జగన్ అధికారం కూల్చి వేతలతో ఆరంభమై.. కూల్చివేతలతోనే కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. తొలుత అమరావతి కాదని..మూడు రాజధానులు అన్నారు.... అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయిల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను సైతం కూల్చివేసిందని.. అదే తరహాలో తాజాగా మంగళగిరిలో అన్న క్యాంటిన్ ధ్వంస రచన జరిగిందని అంటున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మళ్లీ పోటీ చేయనున్నారు. విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఆ నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. అక్కడ ఆయన వాలిపోతున్నారు. అలా ఆ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై దూసుకుపోతున్నారు. మరోవైపు 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని క్లియర్ కట్‌గా చేప్పేశారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో మరోసారి జెండా ఎగరేయాలని వైసీపీ భావిస్తోంది. దాంతో మంగళగిరిలో బలమైన అభ్యర్థి కోసం జగన్ భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. మంగళగిరి మాజీ ఎమ్మెల్యను సైతం ఎమ్మెల్సీని చేసి.. పెద్దల సభలో సభ్యుడిగా చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇలా వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు ఏం చేయాలి.. ఎలా ముందుకు కదలాలి.. అనే కోణంలో.. జగన్ యోచిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరిట అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసింది. ఈ క్యాంటిన్ల ద్వారా చాలా తక్కువ ధరకు పేదవారికి కడుపు నిండా బోజనం పెట్టేవారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ క్యాంటిన్లు మూసి వేసింది. అయితే కరోనా సమయంలో పేదలు, సామాన్యలు భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అన్న క్యాంటిన్లు తెరిచి ఉంటే.. ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగే ఉండేదనే ఓ చర్చ అప్పట్లో గట్టిగానే నడిచింది. ఈ నేపథ్యంలో మంగళగిరితోపాటు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురంలో అన్న క్యాంటిన్లు పున: ప్రారంభించారు. అయితే మంగళగిరిలోని అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లోకి ఓ విధమైన తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని అధికార పార్టీలోని కీలక నేతలే పేర్కొనడం గమనార్హం . Watch video https://www.youtube.com/watch?v=cT58KQ9rS_M
http://www.teluguone.com/news/content/people-jibe-on-jagan-government-25-137471.html





