అమరావతి మహా పాదయాత్ర ముగింపు సభకు పవన్‌కల్యాణ్..
Publish Date:Dec 12, 2021
Advertisement
అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సభకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ముగింపు సభకు హాజరవుతానని పవన్‌కల్యాణ్ చెప్పారని అమరావతి ప్రాంత మహిళా రైతులు తెలిపారు. తొలి నుంచీ అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్నారంటూ మంగళగిరిలో పవన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు మహిళా రైతులు. పాదయాత్ర ముగింపు సభకు ఆయన్ను ఆహ్వానించారు. వాళ్ల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్.. ముగింపు సభకు వస్తానని చెప్పారని రాజధాని ప్రాంత మహిళా రైతులు చెప్పారు. అన్నిపక్షాల మద్దతుతో అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా కాపాడుకుంటామని మహిళలు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో నిర్వహించనున్న పాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అనుమతి నిరాకరించారని ఆరోపించారు. సభకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతి రైతుల పాదయాత్ర ఆదివారం 42వ రోజుకు చేరుకుంది. అంజిమేడులో ప్రారంభమైన యాత్ర.. గుత్తివారిపల్లె వరకు కొనసాగింది. మహిళా రైతులు అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్రలో పాల్గొంటున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళతో పాటు పాదయాత్రలో జారిపడి చేయి విరిగిన మరో మహిళ కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఆదివారం అంజిమేడు నుంచి ఇసుకతాగేలి, దిగువ మల్లవరం, ఎగువ మల్లవరం గుత్తివారిపల్లి వరకు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-will-attend-amaravathi-farmers-end-meeting-39-128220.html





