జనసేనాని ఉక్కు దీక్ష.. ఈసారి మంగళగిరిలో..
Publish Date:Dec 10, 2021
Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకొనేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి తాము అండగా నిలుస్తామని ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో జగన్ ప్రభుత్వం వైపు నుంచి సరైన స్సందన లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా పవన్ కల్యాణ్ సంఘీభావ దీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష డిసెంబర్ 12వ తేదీన ఉదయం 10.00 గంటలకు ప్రారంభించి.. సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. ఈ దీక్షలో జనసేనాని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తోపాటు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంతోపాటు అనుబంధ విభాగాల చైర్మన్లు కూడా పాల్గొనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తొలుత మోదీ ప్రభుత్వంలోని పెద్దలను పవన్ కల్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా సదరు పెద్దలకు లేఖను సైతం పవన్ కల్యాణ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయిందని, ఈ ప్లాంట్ ఒక సెంటిమెంట్ అని వారికి పవన్ కల్యాణ్ విపులీకరించడం జరిగింది. అంతేకాదు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆ ప్లాంట్ ప్రాంగణంలోనే కార్మికులకు మద్దతుగా పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభను సైతం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని జగన్ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు బాధ్యత తీసుకుని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పవన్ కల్యాణ్ సూచించారు. అయితే దీనిపై జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగులు, కార్మికుల చేస్తున్న ఆందోళనలు 300 రోజులు దాటి పోయిన సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-deeksha-on-vishaka-steel-plant-at-mangalagiri-39-128127.html





