పవన్ బీజేపీ ఆడించే తోలుబొమ్మ : మహేశ్ కుమార్ గౌడ్
Publish Date:Jun 15, 2026
Advertisement
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆవిర్భావాన్ని పదేపదే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని, అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ తెలంగాణను అందించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని అవమానించడం పవన్ కళ్యాణ్‌కు కొత్త కాదని, అదే ధోరణిని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు చెప్పిన మాటలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఆయన బీజేపీ ఆడించే తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది సినిమా కాదని, ఇష్టానుసారంగా డైలాగులు చెప్పడానికి రాజకీయాలు వేదిక కాదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆదరణ వల్లే పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి ఎదిగారని, ఇప్పుడు అదే తెలంగాణను కించపరచడం సరికాదని హితవు పలికారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని, అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను అధ్యయనం చేస్తే నెహ్రూ, గాంధీ కుటుంబాల త్యాగాలు తెలుస్తాయని, కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలని అన్నారు. దేశ అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కాంగ్రెస్ చేసిన కృషిని గుర్తించాలని పేర్కొన్నారు. తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని, రాజకీయ పరిపక్వత ఇంకా అవసరమని అన్నారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే అనుమానాలు వారి వ్యాఖ్యలతో బలపడుతున్నాయని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించకపోవడం వెనుక కూడా ఏదో రాజకీయ అవగాహన ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.
http://www.teluguone.com/news/content/pawan-is-a-puppet-played-by-bjp-36-222994.html





