విద్యార్థులకు మార్కులు తగ్గితే లోకేశ్‌కు మార్కులు తగ్గినట్టే..! : సీఎం చంద్రబాబు
Publish Date:Jul 24, 2026
Advertisement
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి ..పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి..! ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇప్పటికే గణనీయమైన మార్పులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల నుంచి లక్షా పది వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడం ప్రభుత్వ విద్యపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల మార్కులు తగ్గితే అది విద్యాశాఖ పనితీరుపైనే ప్రతిబింబిస్తుందని, అందుకే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు మట్టిలో మాణిక్యాలని, సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. విద్యే పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి అని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు రాణించడానికి విద్యే కారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పిల్లల అభివృద్ధి బాధ్యతను తల్లి, తండ్రి ఇద్దరూ సమానంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌లకు తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులేనని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా మెగా పీటీఎంలను నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉపాధ్యాయులు మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా బోధనా విధానాలను మార్చుకోవాలని, కొత్త పద్ధతులను అవలంభించాలని సూచించారు. టీచర్లకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తోందని, బదిలీలను పారదర్శక కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యతో పాటు ఆరోగ్యం, ఉపాధిపైనా ప్రత్యేక దృష్టి..! రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తల్లికి వందనం పథకం నిధులు ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయని చెబుతూ జమ అయ్యాయా లేదా అంటూ సభలోనే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2.0 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, సోలార్ విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రజారోగ్యంపై దృష్టి సారించామని... ఆగస్టు నుంచి సంజీవని హెల్త్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని తెలిపారు. పైగా 14 శాతం మేర వడ్డీలకు కొన్ని అప్పులను తెచ్చిందని ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు. ఆ అప్పులను నెమ్మదిగా తీర్చేందుకు ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నామని.. అలాగే వడ్డీలు తగ్గించేలా కసరత్తు చేస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే మరోవైపు సంక్షేమం, అభివృద్ధిని సమతూకంగా కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఐటీ కోచింగ్ అందిస్తున్నామని, గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలను విస్తరిస్తామని వెల్లడించారు. హాస్టళ్లు, గురుకులాల్లో డైట్ ఛార్జీలను 10 శాతం పెంచామని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని గుర్తుచేశారు. తన పాలనలో 16 ఏళ్లలో 14 సార్లు డీఎస్సీ నిర్వహించానన్నారు. ఈ ఏజెన్సీ ఏరియాలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో రిక్రూటైన ఉపాధ్యాయులే ఉన్నారని దానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ, తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చప్పామని.. దానికి అనుగుణంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాము కూటమిగా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని... మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు రిక్రూట్ చేస్తే... దానిపై బురద జల్లుతున్నారని సీఎం విమర్శించారు. రిక్రూటైన టీచర్ల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఇలాంటి వారిని కట్టడి చేయాలని సూచించారు. రాజకీయ నేతలు, అధికారులు తేడాగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో గతంలో కొందరు దుర్మార్గాలు చేశారని... దళిత డ్రైవరును చంపి డోర్ డెలివరి చేసిన నేతలు ఇక్కడ రాజకీయం చేశారని గుర్తు చేశారు. తల్లిని, చెల్లిని గౌరవించని వాళ్లు సమాజానికి ఏం చెబుతారు..? ఏం మేలు చేస్తారని.. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదని సీఎం అన్నారు. మంచిని ప్రొత్సహించాలి... చెడును తప్పు పట్టాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని... ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ.. వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తున్నామని చెప్పారు. 94 శాతం స్ట్రైక్ రేటుతో గడచిన ఎన్నికల్లో గెలిపించారని... వచ్చే ఎన్నికల్లో అంతకు మించిన గెలుపును సాధిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. డ్రగ్స్‌కు చెక్... గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం..! గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించామని గుర్తు చేశారు. పిల్లలకు చక్కటి విద్యను అందిస్తామని... ఉద్యోగాలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా పెద్దపెద్ద పరిశ్రమలను తెస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్ సంస్థ వచ్చిందని... భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్ పోర్టును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థులు కష్టపడకుండా.. ఇష్టపడి చదవాలని... ఐదేళ్లు కష్టపడి చదివితే పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేలా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పోలవరాన్ని నెంబర్-1 జిల్లాగా తయారు చేస్తామని... 2000లో జీవో నెంబర్-3 తెచ్చి.. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలిచ్చేలా అండగా నిలబడ్డామని గుర్తు చేశారు. కానీ 2020లో సుప్రీం కోర్టు ఆ జీవోను రద్దు చేసిందని... దీనిపై ఇప్పుడు చర్చిస్తున్నామని గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థుల కలలకు సీఎం ప్రోత్సాహం..! సభలో పలువురు విద్యార్థులు తమ లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వారిని అభినందించారు. తాను భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిగా మారి ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తానని చెప్పిన విద్యార్థి సాత్విక్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందిస్తూ, అతని సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని ఆకాంక్షించారు. "డేర్ టు డ్రీమ్... స్ట్రైవ్ టు అచీవ్" అనేది తాను ఎప్పుడూ చెప్పే సందేశమని పేర్కొన్న సీఎం... పిల్లలను ప్రోత్సహించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. విద్యార్థుల ఆలోచనలు, అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వారితో నిరంతరం సంభాషించాలని సూచించారు. పోలవరం ప్రాంతం నుంచి ప్రపంచానికి సేవలందించే స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన "డ్రగ్స్ వద్దు బ్రో" హ్యాండ్‌బుక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం "బడి కోసం డోనర్" వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభమైన వెంటనే మీ సేవ ఆపరేటర్ చిట్టిబోయిన ఉదయ్ కుమార్ రంపచోడవరం హైస్కూల్‌కు రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. నెల్లూరు జిల్లా జెడ్పీ హైస్కూల్‌కు పారిశ్రామికవేత్త పూర్ణ చంద్రరావు రూ.4 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. వీరిద్దరిని సీఎం చంద్రబాబు అభినందించారు. అలాగే సభా వేదిక మీద నుంచి పోలవరం జిల్లాలో వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి వివరించారు. పనితీరు బాగా కనబరిచిన అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి... సభికులతోనూ చప్పట్లు కొట్టించారు. పేరెంట్స్, టీచర్లతో ముఖాముఖి.. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా రంపచోడవరం ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు, మార్కులు, హాజరు, ఆరోగ్య వివరాలను స్వయంగా పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల రిపోర్టు కార్డులను వారి ఇళ్లకే పంపేలా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మరో తరగతి గదిలో స్మార్ట్ బోర్డు ద్వారా బోధనా విధానాన్ని పరిశీలించిన సీఎం.. కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని ఉత్సాహపరిచారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు నాటిన మొక్కలను పరిశీలించిన సీఎం.. గ్రీన్ పాస్‌పోర్టు, క్యూఆర్ కోడ్ ఆధారంగా మొక్కల వివరాలు తెలుసుకునే విధానాన్ని అభినందిస్తూ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మెగా పీటీఎం ఫొటోఫ్రేమ్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఫొటో దిగారు. Parent Teacher Meeting, CM Chandrababu Naidu, Nara Lokesh, Midday Meal Scheme, Rampachodavaram Mega PTM, AP Education, Student Nutrition
http://www.teluguone.com/news/content/parent-teacher-meeting-36-227018.html





