పంజాబ్ లోనూ ఆప్ కు అష్టకష్టాలేనా?
Publish Date:Feb 11, 2025

Advertisement
ఢిల్లీ పరాజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందా? ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో కూడా అధికారం చేజారిపోతోందా? పంజాబ్ లోని భగవంత్ మాన్ సర్కార్ కుప్పకూలిపోవడానికి రంగం సిద్ధమైందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. పంజాబ్ లో ఆప్ పుట్టి మునగడానికి అవసరమైన ప్రయత్నాలను బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఔను మీరు చదివినది నిజమే.. పంజాబ్ లో ఆప్ సర్కార్ కు కాంగ్రెస్ నుంచే ముప్పు పొంచి ఉంది.
ఇప్పటికే పంజాబ్ లోని భగవంత్ సింగ్ మాన్ సర్కార్ పట్ల ప్రజలలో అసంతృప్తి ఓ రెంజ్ లో ఉంది. పార్టీ నేతలూ, క్యాడర్ లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఢిల్లీ ఎన్నికలలో ఓటమి ప్రభావం పంజాబ్ అప్ లోని అసమ్మతీయులకు ఊతం ఇచ్చింది. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత కేజ్రీవాల్ నష్టనివారణ చర్యలకు నడుంబిగించారు. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 11)న జరగనుంది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. అన్ని పనులూ మానుకుని అందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.దీంతో పంజాబ్ లో ఆప్ సర్కార్ భవిష్యత్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో ఆప్ ఓటమి తరువాత పంజాబ్ లో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
దీంతో పంజాబ్ ఆప్ లో కంగారు మొదలైంది. కేజ్రీవాల్ హడావుడిగా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అధికారిక నివాసంలో జరుగుతోంది. వాస్తవానికి పంజాబ్ కేబినెట్ సమావేశం సోమవారం (ఫిబ్రవరి 10) జరగాల్సి ఉంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. ఆ వెంటనే పార్టీ అధినేత కేజ్రీవాల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంజాబ్ ఆప్ లో ఏదో జరుగుతోందనీ, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలా అన్నదానిపై ఆప్ అగ్రనేతలు మల్లగుల్లాలు పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/now-troubles-to-aap-in-punjab-39-192696.html












