పులివెందులకు ఉప ఎన్నిక తప్పదా?
Publish Date:Feb 11, 2025
.webp)
Advertisement
ఊరంతా ఒక దారయితే ఉలిపికట్టది ఒక దారి అన్నట్లుగా ఉంది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ తీరు. తన తీరుతో ఆయన రాష్ట్రంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి తీసుకువస్తున్నారు. జగన్ వ్యవహార శైలి కారణంగా సభలో వైసీపీ బలం మరింత తగ్గిపోయినా ఆశ్చర్యంలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ సారి మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ హాజరు, గైర్హాజరుతో సంబంధం లేకుండా పలు అంశాలను సభ ముందు ఉంచేందుకు ప్రభుత్వం సమాయత్తమౌతోంది. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా సభ ముందు ఉంచాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడం బాధ్యత అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మద్యం,ఇసుక కుంభకోణాలు, ఆ రెండింటిలో ఏ స్థాయిలో దోడిపీ జరిగింది? మనీల్యాండరింగ్ కు పాల్పడిన వారు ఎవరు? ఇత్యాది విషయాలన్నీ ఇప్పటికే దాదాపుగా ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. సభాముఖంగా ఆ వివరాలన్నిటినీ ప్రజల ముందు ఉంచేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ సమాయత్తమౌతోంది.
ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడతానని ప్రకటించేశారు. తాను అడగాల్సింది ఏమైనా ఉంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచే ప్రశ్నిస్తానంటున్నారు. నిజానికి ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అందుకు సరైన వేదిక అసెంబ్లీ మాత్రమే. సూపర్ సిక్స్ హామీలు అంటూ అధికారంలోకి వచ్చి వాటిని అమలును విస్మరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్న జగన్ అదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయొచ్చు కదా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
ఆ విషయాన్ని పక్కన పెడితే అసెంబ్లీకి హాజరవ్వకూడదని జగన్ చెప్పిన కారణాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కూడా జగన్ మాటలను కొట్టిపారేశారు. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా మైకు ఇవ్వరనీ, ఇంతోటి దానికి అసెంబ్లీకి రావడమెందుకనీ ఆయన ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా, తనకు కూడా సభానాయకుడు చంద్రబాబునాయుడికి ఇచ్చినంత సమయం సభలో మాట్లాడేందుకు తనకు కూడా ఇవ్వాలనీ, అప్పుడే సభకు వస్తాననీ అన్నారు. అయితే జగన్ చేసిన ఈ డిమాండ్ ఏ విధంగా చూసినా అసంబద్ధంగా ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రజలు జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఆ హోదా లేకుండా సభలో సభానాయకుడితో సమానంగా సమయం ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. సభలో జగన్ పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టే మాట్లాడేందుకు సమయం ఇవ్వడం జరుగుతుంది. దేశ మంతటా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలోనే, చివరాఖరుకు లోక్ సభలోనూ ఇలాగే జరుగుతుంది. అయితే జగన్ మాత్రం తాను అన్నిటికీ అతీతుడనని భావిస్తున్నట్లుగా ఆయన డిమాండ్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జగన్ పై అనర్హత వేటు అంశాన్ని ప్రస్తావించారు. వీరిరువురూ ఎమ్మెల్యేల పునశ్చరణ తరగతులను ప్రాంభించాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా సమావేశంలో జగన్ డిమాండ్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అవసరమైనంత సంఖ్యాబలం లేకుండా అసెంబ్లీలో సభా నాయకుడితో సమానంగా సమయం ఇవ్వాలని జగన్ ఎలా డిమాండ్ చేస్తారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్ డిమాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కొట్టి పారేశారు. ఎవరైనా సరే నిబంధనల మేరకు నడుచుకోవలసిందేనని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేననీ, వైసీపీకి సభలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టే ఆ పార్టీకి సమయం కేటాయిస్తారని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని స్పష్టమౌతోంది. అయితు జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొడితే ఏం జరుగుతుంది? అన్న దానిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎవరైనా సరే వరుసగా 60 రోజులు సభకు గైర్హాజరైతే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందన్నారు. సభకు హాజరు కాలేకపోవడానికి సహేతుక కారణం చూపుతూ స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి లీవ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుందనీ, అలా ఇవ్వకుండా 60 రోజులు సభకు డుమ్మా కొడితే అనర్హత వేటు పడటం ఖాయమని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆయన మాటలను బట్టి జగన్ ఇదే తీరుగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజర్ అయితే ఆయనపై అనర్హత వేటు పడటానికి ఎంతో సమయం పట్టదు. ఆయనపైనే కాదు, ఆయన ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరౌతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు పడుతుంది. అప్పుడు రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రావడం ఖాయం. అదే జరిగితే అసెంబ్లీలో కూటమి సంఖ్యా బలం బాగా పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్లని రాజకీయ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడం అన్నది సాధ్యమయ్యే పరిస్థితి కాదని రాజకీయ నిపుణులు అంటున్నారు. అదే జరిగి ఉప ఎన్నికలు వస్తే పులివెందుల కూడా కూటమి ఖాతాలో పడే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/by-election-for-pulivendula-39-192693.html












