ఇక టీఆర్ఎస్ నుంచీ జంప్ జిలానీలు
Publish Date:Apr 26, 2022
Advertisement
దాదాపు 9 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు వర్గ విభేదాలు ఆ పార్టీని చీకాకు పెడుతున్నాయా అంటే అవుననే అనాలి. పలు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు ఆయా జిల్లాల్లో పార్టీని చీకాకు పరుస్తున్నాయి. అంతే కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆయా నియోజకవర్గాలలో సిట్టింగులకు, సీటు ఆశిస్తున్న ఆశావహులకు మధ్య పొసగడం లేదు. దీంతో అసమ్మతీయులు పక్క చూపులు చూస్తున్నారు. అటువంటి వారిని అక్కున చేర్చుకోవడానికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి. తెరాస అసమ్మతి వాదులకు తలుపులు బార్లా తెరిచి ఉంచాయి. దీంతో ఇప్పటి వరకూ ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చి చేరడమన్న పరిస్థితి ఇక ముందు తెరాస నుంచి వలసలుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెరాసలో ధిక్కార స్వరం వినిపించడమే ఇందుుక నిదర్శనమని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితిని వారు ఉదహరిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీల మధ్య విభేదాల పరిష్కారం పార్టీ అధినేత వల్ల కూడా కాకపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఈ ఇరువురిలో ఒకరు పార్టీ మారే విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల మధ్య విభేదాలు తెలిసిందే. అయితే ఇటీవల ఇరువురి మధ్యా సంబంధాలు మరింతగా దెబ్బతిన్నట్లు వరుస సంఘటనలను బట్టి అర్ధమౌతుంది. రానున్న ఎన్నికలలో తాండురు నుంచి పార్టీ ఎమ్మెల్యేగా పోటీలో ఉండేది తానేనని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకుంటుండటంతో విషయాన్ని హై కమాండ్ దగ్గరకు తీసుకు వెళ్లారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. దీంతో పార్టీ అధినేత ఇరువురతో మాట్లాడినా పరిస్థితితో మార్పు రాలేదు. దీంతో ఎమ్మెల్యే కినుక వహించినట్లు చెబుతున్నారు.
అలాగే ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఆశావహులు, సిట్టింగ్ ల మధ్య పెద్దగా పొసగడం లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల ఇప్పటికే అలకపాన్పు ఎక్కారు. ఆయన ఎప్పుడైనా పార్టీ మరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/now-jumpings-from-trs-25-135024.html