అట్లుంటది రేవంత్‌రెడ్డితోని!!

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది. కవిత జైలు నుంచి విడుదల అవ్వకపోయినా పర్లేదుగానీ, ఏపీలో చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాకూడదని తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ ముక్కోటి దేవతలకు మొక్కుకున్నారు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిసిపోవడంతో, ఈ బ్యాచ్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీలో  చంద్రబాబు అధికారంలోకి రాగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. చంద్రబాబు గురువు, రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి, గురువుకు అనుకూలంగా శిష్యుడు వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నాడని అరచి గోలచేసి, తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.  ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడంటే తనకు ఎంతో గౌరవం వుందే తప్ప, రాజకీయంగా ఆయనకీ తనకి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా చెబుతున్నారు. ఈ మధ్య రేవంత్ మీడియా వాళ్ళని కలసినప్పుడు ఓ నోటి తుత్తరగాడు ఇలా అడిగాడు.. తెలంగాణలో పోటీ పెట్టకుండా గురువు సహకరించారు.. ఇప్పుడు అక్కడ గురువు పోటీ చేస్తున్నారు. శిష్యుడు సహకరిస్తారా? అని అడిగాడు. దాంతో రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం లాగా సీరియస్సయిపోయి వార్నింగ్ ఇస్తూ, ‘‘ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేవాడు.. శిష్యుడెవరు, గురువెవరు? నేను సహచరుడిని అని చెప్తున్నాను. ఎవడైనా బుద్ధిలేని గాడిద కొడుకు శిష్యుడు, గురువు అని మాట్లాడితే బుడ్డిమీద పెట్టి తంతా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన సహచరుడిని నేను. నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళాను. నేను ఆయనకు సహచరుణ్ణి.  వారంటే అపారమైన గౌరవం వుంది ఇప్పటికి కూడా చెప్తున్నా.. అంతే తప్ప గురువు, శిష్యుడు అంటే ఊరుకునేది లేదు. నేను తెలంగాణ వాణ్ణి, కాంగ్రెస్ పార్టీ వాడిని. తెలంగాణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాను’’ అని స్పష్టంగా చెప్పారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ఏపీకి, తెలంగాణకి ఉమ్మడి రాజధాని కాదు కాబట్టి, ప్రస్తుతం హైదరాబాద్‌లో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో వున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కుదరాల్సిన పంపకాల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు మీద గౌరవం గౌరవమే, తెలంగాణ ప్రయోజనాలు ప్రయోజనాలే అన్నట్టుగా వ్యవహరించి, కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకుండా కంట్రోల్ చేయాలన్న వ్యూహంలో రేవంత్ వున్నారు.
Publish Date: May 17, 2024 6:11PM

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు సుప్రీంలో ఊరట 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.  తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పిటిషన్ విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022లో విఠల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. దీనిపై రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టుకు వెళ్లారు. తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, కాబట్టి విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో విఠల్‌కు ఊరట లభించింది.  
Publish Date: May 17, 2024 5:56PM

వైసీపీ ఓట్లకు కాంగ్రెస్ గండి... శ్రీకాకుళం ఎంపీగా కింజారపు విజయం నల్లేరు మీద బండి నడకే!

శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది.  దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ గాలి వీచిన సమయంలో కూడా ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఆ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్ సభ స్థానంతో పాటు.. టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. ఇదే నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న విశ్వాసాన్ని కింజారపు వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ సారి ఎలాగైనా కింజారపును ఓడించాలన్న లక్ష్యంతో జగన్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కలింగ సమాజిక వర్గానికి చెందిన పెరడ తిలక్ ను శ్రీకాకుళం నుంచి వైపీపీ అభ్యర్థిగా పోటీలో దించారు. ఈ పేరాడ తిలక్ గత ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజారపు అచ్చెన్నాయుడి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి జగన్ ఆయనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే  ఇక్కడ నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గానికే చెందిన పేరాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆ సమాజికవర్గ ఓట్లు భారీగా చీలిపోచే అవకాశాలున్నాయి. అలాగే వైసీపీ నుంచి  శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి   కిల్లి కృపారాణి సీటు దక్కక పోవడంతో  సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  దీంతో ఆమె టెక్కలిలో వైసీపీ ఓట్లకు బారీగా గండి కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అలాగే ఇంత కాలం వైసీపీకి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు కూడా వైసీపీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోందనీ, దీంతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజవర్గంలో వార్ వన్ సైడ్ గా కింజారపు రామ్మోహన్ నాయడికి సానుకూలంగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.   అంతే కాకుండా పలువురు వైసీపీ మద్దతుదారులు కూడా వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  మొత్తం మీద వైసీపీ ఓట్లను కాంగ్రెస్ భారీగా చీల్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  
Publish Date: May 17, 2024 4:49PM

పిన్నెల్లి బ్రదర్స్ అదృశ్యం 

మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.  ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసింది.తాజాగా, అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్ మన్లను కూడా వదిలేసిన ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్ మన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 
Publish Date: May 17, 2024 4:47PM

ఆంధ్రా నీరో జగన్!!

రోమ్ నగరం తగలబడి పోతుంటే అప్పటి రోమన్ కింగ్ నీరో (nero) ఏం చేశాడో ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. రోమ్ తగలబడిపోతే తగలబడిపోనీ నాకేంటి అనుకుంటూ, చక్కగా తన రాజమందిరంలో ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ వింత చర్య గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకు నీరో రేంజ్‌లో మన సమాజానికి దక్కిన మరో పాలకుడు వై.ఎస్.జగన్! పోలింగ్‌ సందర్భంగా, పోలింగ్ తర్వాత వైసీపీ గూండా మూకలు భారీ స్థాయిలో దాడులు చేసి వందల మందిని గాయపరిచాయి. సాక్షాత్తూ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని హత్య చేయడానికి ప్రయత్నించాయి. తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం సానుభూతిపరుల మీద, తెలుగుదేశానికి ఓటు వేశామని చెప్పినవాళ్ళ మీద దాడులు చేసి రక్తాన్ని పారించారు. ఎన్నికల ఫలితాలు వెలువడేలోపు, ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాష్ట్రంలో రక్తపాతం ఇంకా జరిగే ప్రమాదం వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా జగన్ ఎంతమాత్రం స్పందించలేదు. దారుణాలు ఆపే ప్రయత్నాలు చేయలేదు. తీవ్రంగా గాయపడిన అనేకమందిని పరామర్శించే సంగతి అటుంచి, కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. ఇలాంటి అల్లర్లను ఆపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయలేదు.. ఎంచక్కా తనంతట తాను విహారయాత్రలు చేయడానికి విదేశాలకు చెక్కేస్తున్నారు. ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
Publish Date: May 17, 2024 4:44PM

భారత ఆసియా దేశాల వారధిగా బౌద్ద పర్యాటకం

ఎబిటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు  మల్లేపల్లి లక్ష్మయ్య పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు  ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని  మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం (మే 17) భూటాన్ లోని థింపూలో జరిగిన బంగ్లాదేశ్ భూటాన్ లోనిథింపూలో జరిగిన బంగ్లాదేశ్, భూటాన్ , ఇండియా, నేపాల్ , మయన్మార్(బిబిఐఎన్ఎమ్) దేశాల పర్యాటక సమాఖ్య, అసోసియేషన్ ఆఫ్ బుద్దిస్ట్ టూర్ ఆపరేటర్స్ (ఏబీటీవో) సంయుక్తంగా నిర్వహించిన ‘ఆసియా రహదారిపై బౌద్ద పర్యాటకం’ అన్న సదస్సుకు ఆయన ఏబీటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్ష హోదాలో  ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.  తెలంగాణలోని ప్రముఖ బౌద్ద పర్యాటక స్థలాలతో పాటు  బుద్ద వనాన్ని  ఆసియాదేశాలకు పరిచయం  చేసి, అధిక సంఖ్యలో బౌద్ద పర్యాటకులను తెలంగాణకు రప్పించటానికి ఏబీటీవో ఇప్పటికే ప్రణాళికలను సిద్దం చేసిందని సంబంధిత దేశ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించిందని అన్నారు.  ఏబీటీవో ప్రదానకార్యదర్శి డాక్టర్ కాలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను  వివరిస్తూ  ఆసియా హైవే 2025 చివరకు అందుబాటులోకి వస్తుందన్నారు.  స్థానిక ఏబీటీవో అధికార ప్రతినిధులు పరశురాం, మణి, ట్రావెల్ ఏజెంట్లు , టూర్ ఆపరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో మల్లే పల్లి లక్మయ్య, త్వరలో పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నుంచి  భూటాన్ వరకు అంతర్జాతీయ హపీనెస్ యాత్ర( ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ మార్చ్ )  నిర్వహించటానికి భూటాన్ బౌద్ద సంస్థల ప్రతినిధులతో సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. 
Publish Date: May 17, 2024 4:20PM