పీకేకు పుల్ల పెట్టింది కేసీఆరేనా?.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్...
Publish Date:Apr 26, 2022
Advertisement
కొన్ని రోజులుగా ఒకటే హడావుడి. పీకే కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం. ఇక హస్తానికి మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ ఊహాగానాలు. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారనే వాదన. మరి, కేసీఆర్ పరిస్థితి ఏంటంటూ విశ్లేషణ. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారంటూ బ్రేకింగ్ న్యూస్. నాలుగు రోజుల పాటు ధూంధాంగా నడిచింది ప్రశాంత్ కిశోర్ ఎపిసోడ్. అంత రాగం తీసి.. తాజాగా తుస్సుమనిపించారు ఆ ఐప్యాక్ ఓనర్. కాంగ్రెస్‌లో చేరేది లేదంటూ.. కావాలంటే తన సేవలు కొనుక్కోవచ్చంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తనకంటే.. నాయకత్వం, ఐక్యత, ప్రక్షాళన.. హస్తం పార్టీని గెలిపిస్తుందంటూ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. పీకే కాంగ్రెస్‌లో చేరడం లేదనే వార్త విని.. కొందరు హమ్మయ్య అని కూడా ఊపిరిపీల్చుకునే ఉంటారు. అదేంటి, పీకే ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అనే అనుమానం రాకమానదు. అడక్కుండానే.. పలు సర్వేలు చేసి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని విశ్లేషించి.. గెలవాలంటే ఏమేం చేయాలో ఆలోచించి.. సోనియాను కలిసి.. కాంగ్రెస్ పెద్దలకు వాస్తవం అర్థమయ్యేలా ప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు. ఆ ప్రదర్శనకు ముగ్థులైన 10 జన్‌పథ్.. పీకే సలహాలు, సూచనల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కమిటీ కూడా నియమించి చర్చించింది. పీకే తాను కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పినా.. ఐప్యాక్ సేవలు మరోపార్టీకి అందించనంటేనే చేర్చుకోవాలంటూ సో కాల్డ్ సీనియర్స్ ఆయన చేరికకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనగా.. లేటెస్ట్‌గా హస్తానికి హ్యాండ్ ఇస్తున్నట్టు పీకే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రశాంత్ కిశోర్‌లో ఈ మార్పుకు కారణం ఎవరు? అంటే.. అంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు. అవును, పీకే ఢిల్లీ కాంగ్రెస్‌కు ప్రజెంటేషన్ ఇచ్చాక.. ఆ వెంటనే హైదరాబాద్ వచ్చి.. రెండు రోజుల పాటు ప్రగతిభవన్‌లో మకాం వేసి.. సీఎం కేసీఆర్‌తో మారథాన్ మంతనాలు జరిపారు. అంత ముఖ్యమైన చర్చలు ఏం చేశారో అంటూ అంతా ఆసక్తి కనబరిచారు. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేలా గులాబీ బాస్‌ను పీకే ఒప్పిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, లోపల జరిగింది వేరని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. "అరే పీకే.. నువ్ రాజకీయాల్లో బచ్చేగాడివి.. నేను నీకంటే సీనియర్. ప్రస్తుతం మోదీని కొట్టే మొనగాడు లేడు. ఆ ముసలి కాంగ్రెస్‌తో కలిస్తే.. నీకు లాభం లేదు. నా మాట విను. కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర మాత్రమే. ఆ పార్టీని నీతో సహా ఎవడూ పైకి లేపలేడు. హస్తం పని ఖతం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీవెంట నేనున్నా. కాంగ్రెస్ వద్దు. ప్రాంతీయ పార్టీలే ముద్దు. రీజినల్ పార్టీలకు ఐప్యాక్ సేవలు అమ్ముకో. బాగా డబ్బు సంపాదించుకో. అనవసరంగా హస్తాన్ని నమ్ముకొని ఆగమాగం కాకు".. అంటూ ప్రశాంత్ కిశోర్‌కే కేసీఆర్ హితోపదేశం చేశారని అంటున్నారు. కేసీఆర్‌తో రెండు రోజుల పాటు బ్రెయిన్ వాష్ చేయించుకున్న పీకే.. ఢిల్లీ వెళ్లి.. కూల్‌గా ఆలోచించి.. కాంగ్రెస్‌లో చేరనంటూ ప్రకటించేసి.. కేసీఆర్‌కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారని సమాచారం.
http://www.teluguone.com/news/content/kcr-effect-on-pk-25-135027.html