ఏపీలో కరెన్సీ కష్టాలకు బాబు చెక్..!
Publish Date:Nov 21, 2016
Advertisement
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. పెద్ద నోట్లు చెల్లక..నిత్యావసరాలు కొనలేక సాధారణ జనజీవితం దాదాపు స్తంభించి పోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు నోట్ల దెబ్బకు విలవిలలాడుతున్నారు. వారాంతాల్లో పార్టీలు, పబ్‌లు అంటూ మజా చేసుకునే కార్పోరేట్ ఉద్యోగులు సహా సాధారణ ప్రజలు బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫిసుల వద్ద గంటల తరబడి క్యూలలో పడిగాపులు కాస్తున్నారు. అయినా పని అవుతుందన్న గ్యారేంటి లేదు... తన దాకా వచ్చాకా డబ్బులు అయిపోతాయేమోనన్న భయంతో తిండి, తిప్పలు మాని బ్యాంకుల వద్దే లక్షల మంది జనం బారులు తీరుతున్నారు. ఏటీఎంలో నో క్యాష్ అన్న బోర్డులు చూసి అసహనంతో ఏటీఎం మెషిన్‌లను ధ్వంసం చేస్తున్నారు ప్రజలు. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంది. ఇప్పుడైనా కన్నుతెరవకపోతే పరిస్థితులు ఇంకా శృతిమించుతాయి..జాగ్రత్త అని కేంద్రాన్ని హెచ్చరించింది. అయినా ప్రయోజనం లేదు. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం అలాంటిది..ముందస్తు ప్రణాళిక లేకపోవడం, తర్వాత పరిణామాల గురించి అంచనా వేయకపోవడం సామాన్యుడి జీవనాన్ని చిక్కుల్లో పడేసింది. అక్కడ.. ఇక్కడా అని కాకుండా దేశం మొత్తం దాదాపు ఇదే పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ఎందుకంటే అక్కడుంది చంద్రబాబు..సంక్షోభాలను హ్యాండిల్ చేయడంలో బాబుది అందెవేసిన చెయ్యి. అందుకే ప్రధాని నుంచి ప్రకటన వెలువడిన తర్వాతి నుంచే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం ప్రతిరోజు అధికారులతో సమీక్షిస్తున్నారు. అదే సమయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయించారు. ఈ సర్వే ఆధారంగా అసలు సమస్య ఎక్కడుందో కనుగోని పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఏపీలో కరెన్సీ కొరతను అధిగమించేందుకు రాష్ట్రానికి మరో రూ.5వేల కోట్లు పంపాలని ఆర్‌బీఐ గవర్నర్‌కు లేఖ రాశారు ముఖ్యమంత్రి. బాబు విజ్ఞప్తిని మన్నించిన ఆర్‌బీఐ తొలి విడతలో భాగంగా 2200 కోట్లు ఏపీకి ప్రత్యేకంగా పంపింది. ప్రతి జిల్లాకీ ఇంత అని డిస్ట్రిబ్యూషన్ చేసిన అనంతరం గ్రామీణులు పట్టణాల్లోకి రాకుండా గ్రామాల్లోనే ప్రత్యేక కౌంటర్లు లాంటివి ఏర్పాటు చేశారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏపీ వాసులకు కరెన్సీ కష్టాలు కాస్త తప్పినట్లేనని చెప్పవచ్చు.
http://www.teluguone.com/news/content/notes-ban-45-69331.html





