మనమెందుకు చావాలి.. చంపేయండి..?
Publish Date:Nov 21, 2016
Advertisement
ఉరీ ఘటన తర్వాత పాకిస్థాన్ అంటే అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కేంద్ర రక్షణశాఖా మంత్రి మనోహర్ పారికర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మెషీన్‌గన్ గానీ..పిస్టల్ గానీ పట్టుకుని మీవైపు రావడం చూస్తే..వారు మీకు హలో చెప్పడానికి వచ్చారని అనుకోకండి.. మీరు అమరులు కావడానికి ముందే వారిని అంతం చేయండి.. అంటూ ఆయన సైన్యాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. గోవా ఎన్నికల ప్రచారంలో భాగంగా వాస్కోలో జరిగిన ర్యాలీలో పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ సైన్యం, ఉగ్రవాదులు తరచూ కాల్పులకు తెగబడుతూ భారత సైన్యానికి తీరని నష్టం మిగులుస్తున్నారు. సర్జికల్ స్టైక్స్ జరిగిన తర్వాత కూడా పాక్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోగా.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సైనిక బలగాల్లో ఆత్మవిశ్వాసం నూరిపోసేలా పారికర్ వ్యవహరిస్తున్నారు. కశ్మీర్‌లోని సైనిక బలగాలకు ముష్కరులను మట్టుబెట్టేందుకు పూర్తి అధికారాలు ఉన్నాయనీ..టెర్రరిస్టులు కాల్పులకు తెగబడకముందే వారిని హతమార్చాలని పిలుపునిచ్చారు. కశ్మీర్‌లో సైనికులు ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఉగ్రవాదులు ముందు కాల్పులు జరపనిదే.. సైనికులు కాల్పులకు దిగకూడదనే పరిమితులు పెట్టింది. అయితే నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి పరిమితులను రద్దు చేసిందన్నారు. తమపై కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను కాల్చాలా వద్దా అని ఇప్పుడు జవాన్లు అనుమతులు తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. శత్రువులకు బుద్ధి చెప్పేందుకు వారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. కానీ ఇంత స్వేచ్ఛ ఉన్నా మన సైనికులు అమరులు కావడం నాకు చెప్పలేనంత బాధగా ఉందని పారికర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే పారికర్‌కు పాక్‌పై మంట ఎక్కడ దాకా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో పఠాన్‌కోట్ దాడి సమయంలోనే భారత సైనికులు గాజులు తొడుక్కుని కూర్చోలేదు అని వ్యాఖ్యానించి తన మనసులో ఏముందో చెప్పకనే చెప్పారు. ఉరీ ఘటన తర్వాత ఆయన కసి రెట్టింపయ్యింది. కానీ ఎంతో ముందు చూపున్న పారికర్ వేగంగా తీసుకున్నా తప్పుడు నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు. అంటే ఇప్పటికిప్పుడు యుద్ధం చెయ్యాల్సి వస్తే సై అనడానికి.. శత్రువును దెబ్బ తీయడానికి తాను రెడీగా ఉండటంతో పాటు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారన్నమాట.
http://www.teluguone.com/news/content/-defence-minister-manohar-parrikar-45-69327.html





