ఆంధ్రా పచ్చళ్లే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే!
Publish Date:Oct 17, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడం.. పరిశ్రమల స్థాపనకు ఏపీని మించిన రాష్ట్రం లేదని పారిశ్రామిక వేత్తలు భావిస్తుండటం పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రానికి కంటగింపుగా మారింది. దీంతో ఉన్నవీలేనివీ కల్పించి ఏపీపై దుష్ప్రచారానికి తెగబడుతున్నది ఆ రాష్ట్రం. ఈ విషయంలో కర్నాటక మంత్రులే ముందువరుసలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కాదని మరీ ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు ఏపీకి క్యూ కడుతున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయా రాష్ట్రాలకు కడుపుమంటగా ఉంటుంది. అయితే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కడుపుమంట మరీ ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్ర ఐటీ మంత్రి ఏపీలోని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుచిత రాయితీలు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమ వేదికగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. గూగుల్ వైజాగ్ నే ఎంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల రాయతీలు ఇవ్వడమేననీ, అలాగే రాష్ట్ర జీఎస్టీలో వంద శాతం రీయింబర్స్ మెంట్, భూమి ధరపై పాతిక శాతం డిస్కౌంట్, ఉచిత విద్యుత్ ట్రాన్స్ మిషన్, వాటర్ టారిఫ్ పై పాతిక శాతం రాయతీలు ఇచ్చిందనీ..ఈ స్థాయిలో రాయితీలు ఇచ్చిన రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీయడం ఖాయమని ఖర్గే వ్యాఖ్యానించారు. నిస్సందేహంగా ఆయన వ్యాఖ్యలు ఏపీకి గూగుల్ వచ్చిందన్న కడుపుమంటతోనే అన్నది ఎవరికైనా సులువుగా అర్ధమైపోతుంది. కర్నాటక మంత్రి ఖర్గే వ్యాఖ్యలపై ఏపీ ఐటీ మంత్రి దీటైన బదులిచ్చారు. ఎక్కడా కర్నాటక పేరు కానీ, ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే పేరుకానీ ప్రస్తావించకుండానే లోకేష్ ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. ఈ మేరకు లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ‘ఏపీలో పచ్చళ్లు మాత్రమే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే’ అని పేర్కొన్నారు. ఆ ఘాటును, వేడిని పొరుగురాష్ట్రాల ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/not-only-food-andhra-investment-alsp-spicy-39-208086.html





