ప్రభుత్వ వ్యతిరేకత కాదు.. నా హత్యకు రేవంత్ కుట్ర.. మల్లారెడ్డి కవరింగ్!
Publish Date:May 30, 2022
Advertisement
రెడ్డి సింహగర్జన సభలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా ఈ దాడిని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. సభలో మల్లారెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ప్రశంసించడం, రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ దే అధికారం అని చెప్పడంతోనే సభలో అలజడి రేగిన విషయాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రెడ్డి సమాజిక వర్గం సభ కావడంతో ప్రభుత్వ కార్యక్రమాలపై పొగడ్తలు, ముఖ్యమంత్రిపై ప్రశంసలతో మంత్రి ప్రసంగం ఆ సభలో చేయడం సరికాదనీ, రెడ్డి సామాజిక వర్గ సంక్షేమానికి మంత్రిగా తానేం చేస్తానన్నది చెప్పాల్సింది పోయి.. ప్రభుత్వంపై పొగడ్తలకు తెగబడటమే సభలో అలజడికి మంత్రిపై దాడికి హేతువైందని రెడ్డి సామాజిక వర్గీయులు చెబుతున్నారు. ఎవరెన్ని కారణాలు చెప్పినప్పటికీ మల్లారెడ్డిపై దాడికి అందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తున్న కారణం మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే. అక్కడ జరుగుతున్నది ప్రభుత్వ కార్యక్రమం కాదు, పార్టీ సభ కాదు. ఆ సభకు మల్లారెడ్డి రెడ్డి సామాజిక వర్గ ప్రతినిథిగానే హాజరయ్యారు. ఒక మంత్రిగా ఆయన తన ప్రభుత్వ విజయాలను ప్రస్తావించారు. ప్రభుత్వాధినేత వల్లే రాష్ట్రం ప్రగతి బాటలో పరుగులు తీస్తోందని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రసంగం ఇష్టం లేకపోతే సభికులు సభ నుంచి బయటకు వెళ్లిపోయేవారు. లేకుంటే ప్రసంగం సాగకుండా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... మల్లారెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలకు ఈ సభకు సంబంధం లేదని తెలియజేసేవారు. అలా కాకుండా ఆయన కేసీఆర్ ప్రస్తావత తీసుకువచ్చన సందర్భంలోనూ, టీఆర్ఎస్ కే మళ్లీ అధికారం అన్న సదర్భంలోనూ సభలో అలజడి రేగడం, ఆయనపైకి రాళ్లు, చెప్పులూ విసురుతూ నిరసన వ్యక్తం చేయడాన్ని కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతకు తార్కానంగానే భావించాలని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ వద్దకు వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయడం, మీ పథకాలకూ, మీకూ ఓ దండం మా గడపకు రావద్దంటూ అడ్డుకోవడం లాంటిదే మల్లారెడ్డిపై జరిగిన దాడి అని విశ్లేషిస్తూ రెండూ కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనాలుగానే సూత్రీకరిస్తున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధిని దేశానికే ఆదర్శం అనదగ్గ స్థాయికి టీఆర్ఎస్ సర్కార్ తీసుకువెళ్లిందనీ, ప్రభుత్వ విధానాలూ, పనితీరు కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయంటూ చెప్పుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్ కు మంత్రిపై దాడి శరాఘాతమేననడంలో సందేహం లేదు. ఈ కారణంగానే మల్లారెడ్డి నష్ట నివారణ కోసం విలేకరుల సమావేశంలో తనపై దాడి వెనుక రేవంత్ కుట్ర అంటూ కవరింగ్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ పై మల్లారెడ్డి విమర్శలతో చెలరేగిన సంగతీ తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రేవంత్ తన హత్యకు కుట్ర పన్నారనీ, ఆయన ప్రొద్బలంతోనే రెడ్డి సింహగర్జన సభలో ఓ వంద మంది గలాటా సృష్టించి తనపై దాడికి యత్నించారనీ, నిజానికి అది దాడి కాదు తనపై హత్యాయత్నం అంటూ మల్లారెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. అంతే కాదు రెడ్డిగర్జన సభలో తాను అప్రస్తుత ప్రసంగం చేయలేదనీ వివరణ ఇచ్చుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీరుతామనీ, కరోనా కారణంగానే జాప్యం అయ్యిందని తాను సభలో వివరిస్తున్న సమయంలోనే దాడి జరిగిందని మల్లారెడ్డి చెప్పారు. తనపై దాడికి పాల్పడిన వారిని వదిలేది లేదని శపథం చేశారు. రేవంత్ రెడ్డిని జైలుకు పంపి తీరుతానని పునరుద్ఘాటించారు. తనపై దాడి సంఘటనకు రేవంత్ ను బాధ్యుడిని చేసి ప్రభుత్వ వ్యతిరేకత లేదంటూ ప్రజలను నమ్మించడానికి మల్లారెడ్డి చేసిన ప్రయత్నం ఏ మేరకు సఫలమైందన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.
కాగా మల్లారెడ్డిపై జరిగిన దాడి కచ్చితంగా ప్రభుత్వ ప్రతిష్టను మసక బార్చేదే. తెలంగాణలో ఇప్పటి వరకూ విపక్షాల ప్రసంగాలలోనూ, వాటికి వస్తున్న స్పందనలలోనూ మాత్రమే కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత మల్లారెడ్డిపై దాడి ఘటనతో కార్యాచరణ స్థాయికి చేరుకుంది.
http://www.teluguone.com/news/content/not-anti-incumbency-murder-attempt-says-mallareddy-25-136674.html





