తండ్రి బాటలో తనయుడు.. ఇక లోకేష్ పాదయాత్ర
Publish Date:May 30, 2022
Advertisement
లోకేష్ తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నారు. తండ్రి బాటలోనే పాదయాత్ర చేయాలని సంకల్పించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో ఏపీలో పాదయాత్ర చేసిన సంగతి విదితమే. 208 రోజుల పాటు సాగిన ఆ యాత్రలో చంద్రబాబు 2, 817 కిలోమీటర్లు నడిచారు. హిందు పురం నుంచి ఇచ్ఛాపురం దాకా వస్తున్నా మీకోసం అంటే ఆయన అడుగులు వేస్తుంటే యావదాంధ్రదేశం ఆయన వెంట కదిలిందా అనేలా అద్బుత స్పందన వచ్చింద. ఇప్పుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తండ్రి బాట పట్టారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జగన్ సర్కార్ రాష్ట్ర జనంపై వేసిన మోయలేని భారాలు, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నిర్వహిస్తున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాలని తెలుగుదేశం నిర్ణయించిన తరుణంలో అదే నినాదంతో లోకేశ్ పాదయాత్రకు ఉపక్రమించనున్నారు. లోకేష్ పాదయాత్ర అంశం ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ విషయమై లోకేష్ కూడా స్పష్టత ఇచ్చేశారు. తెలుగుదేశం మహానాడులో పాదయాత్రపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ‘పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే.. అప్పుడు పాదయాత్ర చేసేందుకు రెడీ’ అని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే ఏపీలో పాదయాత్ర చేపడతారని పార్టీ శ్రేణులే కాదు రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/-lokesh-to-stark-padayatra-soon-25-136681.html





