ఈశాన్యంలో బరువు
Publish Date:Jul 31, 2018
Advertisement
అదో చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో అంతా ఆరోగ్యంగా, హాయిగా ఉండేవాళ్లే... ఓ కుర్రవాడు తప్ప. ఆ కుర్రవాడు చిన్నప్పటి నుంచి చాలా బక్కపలచగా, నీరసంగా ఉండేవాడు. దాంతో ఎప్పుడూ ఏదో ఒక జబ్బు చేస్తుండేది. తన జీవితం ఇంక మంచానికే అంకితం అనుకున్నాడు కుర్రవాడు. నిదానంగా ఎటూ కదలకుండా ఇంటిపట్టునే ఉండటం మొదలుపెట్టాడు. అతని స్నేహితులు, బంధువులు అంతా దూరమైపోయారు. తల్లిదండ్రులకు అతను ఓ భారంగా మిగిలిపోయాడు. పరిస్థితులు ఇలా ఉండగా ఓసారి ఆ ఊరికి ఓ స్వామీజీ వచ్చాడు. స్వామీజీని చూడటం ఆలస్యం కుర్రవాడి తండ్రి ఆయన కాళ్ల ముందు పడి భోరుభోరుమని ఏడ్చాడు. తన పిల్లవాడి సంగతి చెప్పి ఏదన్నా ఉపాయం సూచించమన్నాడు. తండ్రి బాధ విన్న స్వామీజీ మనసు కరిగిపోయింది. వెంటనే ఆ కుర్రవాడిని చూసేందుకు వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి పరిసరాలన్నీ బాగా గమనించాడు. ఇంటి వెనక నేలలోకి పాతుకుపోయి ఉన్న ఓ పెద్ద బండరాయి ఆయన దృష్టిని ఆకర్షించింది. ‘‘మీ ఇంటి ఈశాన్యంలో ఇంత బరువు ఉండబట్టే ఈ దరిద్రం పట్టింది. కుర్రవాడితో వెంటనే ఆ రాతిని పక్కకి జరిపించు. పరిస్థితులన్నీ చక్కబడతాయి,’’ అని సలహా ఇచ్చి తన దారిన తను వెళ్లిపోయాడు. స్వామీజీ చెప్పిన మాటల్ని కుర్రవాడు వెంటనే అమలు చేయడం మొదలుపెట్టాడు. కానీ పాపం ఆ రాయితో ఎంత కుస్తీ పట్టినా ఒక్క అంగుళం కూడా కదలకపోయే! రోజు తర్వాత రోజు... రాతితో ఎంత పోరాటం చేసినా కాస్త కూడా ఉపయోగం లేకపోయింది. చుట్టుపక్కల వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. కానీ కుర్రవాడిలో ఏదో ఒక మూల తన జీవితం బాగుపడుతుందేమో అన్న ఆశ. ఆ ఆశతోనే రాయిని జయించే ప్రయత్నం కొనసాగించాడు. కొన్నాళ్లు తాళ్లని కట్టి లాగాడు, ఇంకొన్నాళ్లు సుత్తితో రాయిని మోదాడు. కానీ ఏం చేసినా రాయిని మాత్రం పూర్తిగా అక్కడి నుంచి తొలగించలేకపోయాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఆరు నెలలు గడిచిపోయాయి. కుర్రవాడిలో పట్టుదల తగ్గలేదు... ఆ రాయీ అక్కడి నుంచి కదల్లేదు. ఇంతలో ఆ స్వామీజీ మళ్లీ అటువైపుగా వచ్చాడు. స్వామీజీని చూడగానే కుర్రవాడి తండ్రి భగ్గుమన్నాడు- ‘మీరేదో మంచి ఉపాయం చెబుతారని మీతో మా కష్టాలు పంచుకుంటే ఇలాంటి పనికిమాలిన పని అప్పగిస్తారనుకోలేదు. మీరు అప్పగించిన పని ధ్యాసలో పడి కుర్రవాడు నిరంతరం ఆ రాయి దగ్గరే ఉంటున్నాడు. మీరు ఇంత మోసగాళ్లు అనుకోలేదు...’ అంటూ కడిగిపారేశాడు. కుర్రవాడి తండ్రి మాటల్ని విన్న స్వామీజీ చిరునవ్వుతో... ‘‘ఒక్కసారి నీ కొడుకు వంక చూడు. ఆరునెలలకీ ఇప్పటికీ మధ్య అతనిలో ఏమన్నా మార్పు వచ్చిందేమో గమనించు,’’ అన్నాడు. స్వామజీకి మాటలు విన్న తండ్రి ఒక్కసారి తన కొడుకు వంక చూశాడు. ఒకప్పుడు బక్కపలచగా తూలిపోతున్నట్లు ఉండే తన కొడుకు బలిష్టంగా తయారయ్యాడు. అతని కండలన్నీ చెమటలు పట్టి ఎండలో మెరుస్తున్నాయి. అతని చూపులో పట్టుదల కనిపిస్తోంది, చేతులు చురుగ్గా కదులుతున్నాయి. ‘‘నిజమే అప్పటికీ ఇప్పటికీ నా కొడుకులో అసలు పోలికే లేదు. నేను ఆ దిశగా గమనించనేలేదు సుమా!’’ అంటూ ఆశ్చర్యపోయాడు తండ్రి. ‘‘శ్రమని మించిన వరం లేదు. అది ఎప్పుడూ వృథా పోదు. ఇన్నాళ్లూ ఆ విషయం తెలియక నీ కొడుకు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. శరీరాన్ని ఎందుకూ పనికిరాకుండా మార్చుకున్నాడు. మీ ఇంటి ఈశాన్యంలో ఉన్న బరువు నీ కొడుకు బద్ధకమే! అది ఇప్పుడు తొలగిపోయింది,’’ అంటూ చెప్పుకొచ్చాడు స్వామీజీ! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
http://www.teluguone.com/news/content/north-east-vastu-dosh-35-82898.html