కాన్ఫిడెన్స్ పెరగాలా... నిటారుగా కూర్చోండి చాలు!
Publish Date:Aug 6, 2024
Advertisement
ఆత్మవిశ్వాసం పెరగడానికి చాలా చిట్కాలే వినిపిస్తూ ఉంటాయి. వినడానికి అవన్నీ బాగానే ఉంటాయి కానీ, పాటించడం దగ్గరకి వచ్చేసరికి తాతలు దిగి వస్తారు. దాంతో చిట్కాలన్నింటినీ మూటగట్టి... ఉసూరుమంటూ పనిచేసుకుపోతాం. కానీ ఇప్పుడు మనం వినబోయే చిట్కా పాటించడానికి తేలికే కాదు, దీంతో అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు పరిశోధకులు. కొంతమందిని చూడండి... వాళ్లు నిటారుగా నడుస్తారు, కూర్చున్నా కూడా నిటారుగానే కూర్చుంటారు. వాళ్లని చూసి- ‘అబ్బో వీళ్ల మీద వీళ్లకి ఎంత నమ్మకమో’ అన్న ఫీలింగ్ తెలియకుండానే కలుగుతుంది. నిటారుగా కూర్చుంటే ఎవరిలో అయినా ఆత్మవిశ్వాసం పెరుగుతుందా! అనే అనుమానం వచ్చింది అమెరికాలో కొంతమంది పరిశోధకులకి. దాంతో వాళ్లు ఓ ప్రయోగం చేసి చూశారు.ఈ ప్రయోగంలో భాగంగా 71 మందిని ఎన్నుకొన్నారు. ‘ఒక ఉద్యోగం చేసేందుకు మీలో ఉన్న మూడు పాజిటివ్ లక్షణాలు, మూడు నెగెటివ్ లక్షణాలు ఒక పేపరు మీద రాయండి,’ అని అడిగారు. అయితే ఇలా రాసే సమయంలో ఓ సగం మంది నిటారుగా కూర్చుని రాయాలనీ, మిగతావాళ్లు చేరగిలబడి రాయాలనీ సూచించారు. నిటారుగా కూర్చుని రాసినవాళ్లు తమలో ఉన్న పాజిటివ్ లక్షణాలను చాలా బాగా ప్రజెంట్ చేయగలిగారు. అదే సమయంలో నెగెటివ్ లక్షణాలు అసలు పెద్ద విషయమే కాదన్న అభిప్రాయం కలిగేలా రాసుకొచ్చారు. ఇక చేరగిలబడి కూర్చున్నవారి పద్ధతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తమలో ఉన్న పాజిటివ్ లక్షణాలను కూడా చాలా సాధారణంగా రాసుకొచ్చారు. ఇక నెగెటివ్ లక్షణాలను గొప్ప సమస్యలుగా చిత్రీకరించారు. విచిత్రం ఏమిటంటే... నిటారుగా కూర్చున్నప్పుడు తమ కాన్ఫిడెన్స్‌లో మార్పు వచ్చిన విషయం వాళ్లకి కూడా తెలియలేదు. కానీ వాళ్ల చేతల్లో మాత్రం గొప్ప మార్పు కనిపించింది. అదండీ విషయం! ఈ చిన్న చిట్కా కనుక పాటిస్తే... పరీక్షలు రాయడం దగ్గర నుంచి ఇంటర్వ్యూలో జవాబులు చెప్పడం వరకూ ఎలాంటి సందర్భంలో అయినా మనలో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుందని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. నిటారుగా కూర్చోవడం, నడవడం వల్ల... మన ఆలోచనల్లో స్పష్టత వస్తుందనీ, అదే కాన్ఫిడెన్సుకి దారితీస్తుందనీ చెబుతున్నారు. - నిర్జర.
http://www.teluguone.com/news/content/how-to-build-self-confidence-35-82835.html