సాదాసీదాగా సీతమ్మ బడ్జెట్
Publish Date:Feb 1, 2022
Advertisement
ప్రతి నాణ్యానికి బొమ్మా బొరుసు రెండూ ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (ఫిబ్రవరి 1, 2022) ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ కూడా అంతే, అలాగే వుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మెరుపులు ఏవీ ఆశించిన విధంగా లేవు. ఎన్నికల కొలమానంగానే కాదు, సాధారణ ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకున్నా, నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్’ లో మెరుపులు లేవు. మరకలు అంతగా లేవు.
సుమారు గంటన్నర సేపు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ 14 శాతానికి పెంచుకునే అవకాశాన్ని కేంద్రమంత్రి కల్పించారు.ఐటీ రిటర్న్ దాఖలులో వెసులుబాటు కల్పించారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్న్ లు సమర్పించిన రెండేళ్ల తర్వాత కూడా సవరణలు చేసుకోవచ్చు. త్వరలో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.కానీ, వేతన జీవులు ఒరుకునే పన్ను మినహయింపు విషయంలో మాత్రం మరో సారి మోడీ చేయి చుపించారు. ఏడేళ్ల కిందట యూపీఏ హయాంలో రెండున్నర లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉండేది. ఈ ఏడేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం ఎంతో పెరిగింది. అయినప్పటికి పన్ను మినహాయింపు ఆ స్థాయి నుంచి పెంచడానికి కేంద్రం అంగీకరించడం లేదు. ఈ సారి కూడా ఒక్క రూపాయి కూడా అదనపు పన్ను మినహాయింపు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
మరో వైపు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నెలకు రూ. లక్షా నలభై వేల కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే.. పరోక్ష పన్నుల రూపంలో ప్రజలందరి వద్ద వసూలు చేస్తున్న మొత్తం అది. అందులో పెట్రోల్, డీజిల్ మద్యం తో పాటు స్థానకి ప్రభుత్వాలు వసూలు చేసేవి ఉండవు. ఇక గొప్పగా దేశంలో మార్పులు తెచ్చే సంస్కరణలు ఏమైనా చేపట్టారా అంటే.. అదీలేదు.కొత్తగా డిజిటల్ రూపీ తీసుకొస్తామని ప్రకటించారు. అలాగే డిజిటల్ కరెన్సీపై పన్ను విధించారు. మొత్తంగా దేశ బడ్జెట్ ఏకంగా 17 లక్షల కోట్ల లోటులో ఉంది. అప్పులతోనే కేంద్రం కూడా బండి నడిపించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనూ గొప్పగా ప్రచారం చేసుకునేలా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు.
రాష్ట్రాలకు ఆర్ధిక సాయం కోసం బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం రూ. లక్ష కోట్లతో నిధిని ఏర్పాటుచేయనున్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలను అందజేయనున్నారు. అంతే కానీ, ఎన్నికలు జరిగే రాష్ట్రాలను ఆకట్టుకునేందుకు ‘తాయిలాలు ఏమీ ప్రకటించలేదు.
http://www.teluguone.com/news/content/no-specialties-in-nirmalas-budget-39-131048.html





