ఇక 50 ఏళ్ల వరకూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అక్కర్లేదు!
Publish Date:Jun 9, 2026
Advertisement
దేశంలో వాహన చోదకులకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించనుంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది వాహనదారులకు భారీ ఊరట కల్పించేలా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నది. అదేంటంటే.. ప్రస్తుతం.. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే.. అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్‌ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది. అంటే మీరు చిన్న వయసులోనే లైసెన్స్ పొందితే, 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎలాంటి రీన్యూవల్ టెన్షన్స్ లేకుండా నిశ్చింతగా వాహనాలను నడుపుకోవచ్చన్నమాట. ఈ నయా ప్రతిపాదన వెనుక కేవలం గడువు పెంపు మాత్రమే కాదు.. రవాణా శాఖకు సంబంధించిన అనేక సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే బలమైన సంకల్పం కూడా ఉంది. ఇకపై వాహనాల యాజమాన్య బదిలీ ప్రక్రియతో పాటు వివిధ రకాల పర్మిట్ల పునరుద్ధరణ (Permit Renewal) పనులను వంద శాతం ఆన్‌లైన్ విధానంలోనే పూర్తి చేసేలా సరికొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రాంతీయ రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
http://www.teluguone.com/news/content/no-need-to-renew--driving-license-until-50years-age-36-222387.html





