ఖాళీల భర్తీపై దృష్ఠి సారించేదెన్నడు?!
Publish Date:Jun 6, 2023
Advertisement
ఒడిశాలోని బలాసోర్ ట్రిపుల్ ట్రైన్ దుర్ఘటన దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను సైతం దిగ్భ్రాంతికి లోను చేసింది. మనది ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్. అయితే ఈ భారీతనానికి సరిపడ వర్క్ ఫోర్స్ ఏ మాత్రం లేదు. రైల్వేశాఖ స్వయంగా వెల్లడించిన వివరాల మేరకు సిబ్బంది మేరకు వర్క్ లోడ్ పెరుగుతోంది తప్ప సిబ్బంది సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇప్పటికీ చాలా కీలక పోస్ట్ లు ఖాళీగానే ఉన్నాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పిన లెక్కల ప్రకారం... ప్రస్తుతానికి మన ఇండియన్ రైల్వేలో దాదాపు 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్ట్లు ఖాళీగానే ఉన్నాయి. గతేడాది మార్చిలోనే ఈ లెక్కలు చెప్పారాయన. అప్పటి నుంచీ వీటిని భర్తీ చేయలేదు. ఇప్పటికీ అవి ఖాళీగానే ఉన్నాయి. 2022 డిసెంబర్ 1వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా నాన్ గెజిటెడ్ విభాగంలో 3 లక్షల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా నార్త్ జోన్లోనే ఎక్కువగా 38,754 ఖాళీలున్నాయి. వెస్టర్న్ జోన్లో 30,476, ఈస్టర్న్ జోన్లో 30,141, సెంట్రల్ జోన్లో 28 వేల 650 ఖాళీలున్నట్టు చెప్పారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అంటే... ఇంజనీర్స్, టెక్నీషియన్స్, క్లర్క్లు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్లు. ఈ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఉన్న వారిపైనే పని భారం పెరుగుతోంది. టికెట్ బుకింగ్ విభాగంలోనూ సిబ్బంది సరిపడినంతగా లేదు. ఫలితంగా...ఇది కూడా సవాలుగా మారుతోంది. కొంత మందైతే రోజుకి 16 గంటల పాటు పని చేస్తున్నారు. కనీసం సెలవులు పెట్టడానికి కూడా వీల్లేనంత బిజీగా ఉంటున్నారు. కొందరు రైల్వేలోనే వేరే డిపార్ట్మెంట్ కు మారేందుకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్లకు ప్రిపరేషన్ కు కూడా టైమ్ దొరకడం లేదు. మొత్తం ట్రైనుకు ఒకరు లేదా ఇద్దరు టీసీలతో టిక్కెట్ చెకింగ్ పనులను అప్పగించి.. వాళ్ల మీదే భారం వేసి.. రైల్వే శాఖ తమాషా చూస్తుందని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నా.. వారి బాధలన్ని పట్టించుకునే నాథుడే లేరు. ఇక రైల్ సేఫ్టీ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతానికి దాదాపు లక్షా 40వేల ఖాళీలున్నాయి. ఇదంతా రైల్వే ప్రైవేటీకరణ పాలసీల వల్ల వచ్చిన సమస్యలేనన్న విమర్శ:లు ఉన్నాయి. ఇండియా రవాణాకి వెన్నెముక లాంటి రైల్వే నెట్ వర్క్ లో ఇన్ని పోస్ట్లు ఖాళీ గా ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే రిక్రూటింగ్ సరిగ్గా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. మొత్తం రైల్వే నెట్వర్క్ లో ఉన్న ఖాళీల్లో దాదాపు 25 శాతం మేర ఖాళీలు... భద్రతా విభాగంలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా మోదీ ప్రభుత్వం ప్రమాదానికి ఏవేవో కారణాలు చెబుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాల సంగతి పక్కన పెడితే.... ఖాళీలున్నాయన్న మాట మాత్రం వాస్తవం. రైల్వేలో సంస్కరణలపై దృష్టి పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఖాళీల భర్తీ విషయాన్ని పట్టించుకోవాలి. ప్రపంచంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలు భారత్ లో మెండుగా ఉన్నాయనిపదే పదే చెప్పుకునే మోడీ సర్కార్ .. ఇలాంటి దుర్ఘటనలకు ఏం సమాధానం చెప్పుకుంటుందో.. సవాళ్లను ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/no-focus-filling-up-of-vacancies-25-156393.html